అగ్రరాజ్యం అమెరికా నుంచి దిల్లీ పోలీసులకు వచ్చిన ఒక ఫోన్ కాల్.. ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టింది. ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అదే సోషల్‌మీడియా సంస్థ కాపాడింది. అసలేం జరిగిందంటే..
గురువారం అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో దిల్లీ డీసీపీ అన్వేశ్‌రాయ్‌కు అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దిల్లీ ప్రాంతంలో ఉండే ఓ యూజర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో లైవ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాడని, అందులో అతడు తన చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని ఫేస్‌బుక్ ప్రతినిధులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు ఫేస్‌బుక్ ఇచ్చిన సదరు ఖాతా వివరాలను పరిశీలించారు. అందులో ఒక ఫోన్ నంబరు ఉండే దానికి కాల్ చేయగా స్విఛాఫ్ అని వచ్చింది.
దీంతో పోలీసులు ఆ మొబైల్ నంబరుకు లింకై ఉన్న అడ్రస్‌ను కనుక్కున్నారు. అది ద్వారకా ప్రాంతంలో ఉందని తెలిసి వెంటనే అక్కడికి దగ్గర్లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్, దాని ఇన్‌ఛార్జ్ ఎస్‌ఐ అమిత్ కుమార్‌ను అప్రమత్తం చేశారు. అమిత్ ఆ అడ్రసును గుర్తించి అక్కడకు చేరుకునే సరికి ఓ వ్యక్తి కొన ఊపిరితో కన్పించాడు. తీవ్ర రక్తస్రావమై అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స అందడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
ద్వారకా ప్రాంతానికి చెందిన ఆ 39ఏళ్ల వ్యక్తి భార్య 2016లో చనిపోయింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. గురువారం సాయంత్రం ఓ విషయమై పొరుగువారితో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు యత్నించాడని, దాన్ని ఫేస్‌బుక్‌లో లైమ్ స్ట్రీమింగ్ చేశాడని పోలీసులు తెలిపారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన నోడల్ సైబర్ యూనిట్, సైబర్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అండ్ డిటెక్షన్ యూనిట్లు అంతర్జాతీయ సోషల్‌మీడియా సంస్థలతో సమన్వయ సహకార ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ నుంచి ఆ అలర్ట్ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:'నోడల్ అధికారి పర్యవేక్షణలో వారికి సత్వర సాయం'