ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. 22 ఏళ్లు కుటుంబానికి దురమయ్యాడు. భార్యాపిల్లలు తన కోసం ఎదురుచూస్తున్నారని తెలియక.. ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరిగుతూనే ఉన్నాడు. జ్ఞాపక శక్తి కోల్పోయి.. తన సొంత ఊరును చేరుకోలేక పోయాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత అతడి తలరాత మారింది. విధి అతడిని తన కుటుంబం వద్దకు చేర్చింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి గాథ ఇది.
దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన వ్యక్తి రమాకాంత్ ఝా. తన కుటుంబానికి మెరుగైన జీవితం అందిచాలని కలలు కన్నాడు. కానీ తాను ఉన్న చోట ఏ పని దొరకలేదు. దీంతో తన భార్య, మూడేళ్ల కుమారుడిని ఇంట్లో వదిలేసి.. ఉపాధి కోసం హరియాణాకు రైలులో పయనమయ్యాడు. హరియాణాలోని అంబాలా స్టేషన్లో రైలు ఆగింది. వాటర్ బాటిల్ కొనడానికి దిగిన రమాకాంత్ మళ్లీ ట్రైన్ ఎక్కలేకపోయాడు. అతడు ఎక్కేలోపే రైలు వెళ్లిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో రమాకాంత్‌కు తోచలేదు. అలా క్రమంగా ఆకలి, దప్పిక అతడి మానసిక పరిస్థితిని మరింత దిగజార్చాయి.
ఇదిలా ఉంటే, రమాకాంత్.. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో అతడి కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అతడి ఆచూకీ తెలియలేదు. అయినా అతడి భార్య, కుమారుడు ఆశలు వదులుకోకుండా రమాకాంత్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.