భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టాడు. ఈ ఘటన బంగాల్ దక్షిణ 24పరగణాలు జిల్లాలోని బిష్ణుపుర్ ప్రాంతంలో వెలుగు చూసింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ముర్షీదాబాద్‌లో నివాసముంటూ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న నిందితుడు అలీమ్ షేక్(35)కు మన్వార మండలానికి చెందిన ముంతాజ్ షేక్(35) అనే మహిళతో 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వివాహానంతరం అలీమ్ అత్తామామలు బిష్ణుపుర్‌లోని చిట్‌భాగి ప్రాంతానికి నివాసం మార్చారు. అలీమ్ సర్దా గార్డెన్స్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ముంతాజ్ సమాలీ ప్రాంతంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసేది. రోజులాగే మంగళవారం ఉదయం పనికి వెళ్లేందుకు ముంతాజ్ తన భర్త అలీమ్‌తో కలిసి బయలుదేరింది. ఆరోజు రాత్రైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అలీమ్ ఎప్పటిలాగే రాత్రి తన అత్తమామల ఇంటికి వచ్చాడు. అయితే బుధవారం ఉదయం వరకు ముంతాజ్ కనిపించకపోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు అలీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే భార్య ముంతాజ్‌ను హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు భార్యను హత్య చేసి ఆమెను ముక్కలుగా నరికాడు. అనంతరం దగ్గర్లోని ఓ చెరువు వద్ద వాటిని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. పాతిపెట్టిన చోటుకు హంతకుడు అలీమ్‌ను తీసుకెళ్లి డెడ్‌బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమ బిడ్డలాంటి దాన్ని అత్యంత కిరాతంగా చంపిన అలీమ్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అలీమ్‌ను అరెస్టు చేశారు. కాగా, ఈ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో అలీమ్‌తో పాటు ఇంకెవరికైనా సంబంధం ఉన్నా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.