పార్వతీ-దేవదాసు, లైలా-మజ్నూ, సలీం-అనార్కలీ.. వీరంతా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న జంటలు. కానీ అసోంలో అంతకు మించిన ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్న యువతి అర్ధాంతరంగా చనిపోవడం వల్ల ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. మృతదేహం వద్ద రోదించి..చివరకు ఆమెకు తాళి కట్టాడు. ఆమె కుటుంబ సభ్యుల ముందే మృతదేహాన్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రేయసి నుదిటిపై కుంకుమ పెట్టి.. దండ వేశాడు. ఇక జీవితంలో ఎవరినీ వివాహం చేసుకోనని.. ఒంటరిగానే ఉంటానని శపథం చేశాడు.
ప్రేమంటే ఇదేరా! చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన ప్రియుడు - అసోం చాపర్ముఖ్ న్యూస్
ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు చనిపోవడాన్ని ఆ యువకుడు జీర్ణించుకోలేక పోయాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలన్న తన ఆశ నెరవేరకపోవడంతో.. ప్రేయసి మృతదేహానికి తాళి కట్టాడు. ఇక తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని.. ఒంటరిగానే ఉండాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ యువకుడు.. ఆ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.
అసోంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి.. కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం తెలుసుకుని ఆమె ఇంటికి చేరుకున్న బిటుపన్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. జీవితాతం కలిసి నడవాలనుకున్న తన ప్రేయసి ఇలా విగత జీవిలా మారడాన్ని తట్టుకోలేకపోయాడు.
చివరికి మృతదేహానికే తాళికట్టాలని నిర్ణయించుకున్నాడు. జీవితాంతం ఒంటరిగా ఉంటానని మరో పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. ప్రేమ పేరుతో వంచిస్తున్న యువతీ యువకుల సంఘటనలు నిత్యం వెలుగుచూస్తుండగా... బిటుపన్ చేసిన పనికి స్థానికులతోపాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు