Man kills grandmother over property dispute : సినిమాలు చూసి ఓ తండ్రి తనయులు దారుణానికి పాల్పడ్డారు. సొంత తల్లి అని కనికరం లేకుండా కొడుకు, సొంత బామ్మ అని అనుకోకుండా మనవడు.. ఆ వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపేశారు. హత్య చేసి ఏమి ఎరుగనట్టు ఆమెపై పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని కేశవ్‌నగర్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే :
ఉషా విఠల్ గైక్వాడ్(64) అనే మహిళ దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పని చేసేవారు. పదవీవిరమణ తర్వాత ఆమె కేశవనగర్‌లో స్థిరపడ్డారు. ఇంట్లో ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్(45), కోడలు, మనవడు సాహిల్ అలియాస్ గుడ్డు గైక్వాడ్(20) ఉండేవారు. తరచూ అత్త- కోడలి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలోనే ఆగస్టు 5న ఉషకు కోడలితో మరోసారి గొడవ జరిగింది. పార్లే బిస్కెట్లు ఇవ్వలేదనే విషయంపై ఇరువురూ గొడవపడ్డారు. దీంతో కోడలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, మధ్యాహ్నం సమయంలో వృద్ధురాలు నిద్రలోకి జారుకున్నారు. అప్పుడే మనవడు సాహిల్.. వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమెను బాత్రూంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హతమార్చాడు.
ఆ తర్వాత ఆమె శరీరాన్ని మాయం చేసేందుకు తన తండ్రితో కలిసి అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఓ దుకాణం నుంచి చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్ను కొనుగోలు చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ కటర్‌తో మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. శరీరాన్ని 9 భాగాలు చేసి సంచులలో కుక్కేశారు. కొన్ని బ్యాగ్‌లను బైక్‌పై, మరికొన్ని బ్యాగ్‌లను కారులో ఎక్కించారు. అనంతరం ఆ సంచులను వేసుకుని ముథా నది వద్దకు వెళ్లి ఆ నీటిలో మూడు సంచులను పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో ఓ బ్యాగ్‌ను పారేశారు. రక్తంతో తడిచిన కత్తిని, దుస్తులను మజ్రీ నది ఒడ్డున వదిలేశారు.