Man Killed Wife And Daughter By Using Snake :నిద్రలో ఉన్న సమయంలో భార్య, రెండేళ్ల కుమార్తెలపై విష సర్పంతో కాటువేయించి అతి కిరాతకంగా చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఒడిశాలోని గంజాం జిల్లాలో నెలన్నర క్రితం జరిగింది. జంట హత్యల ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు నిందితుడిను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసులో అరెస్టయిన వ్యక్తి తప్పించుకునేందుకే ఈ పథకం పన్నినట్లుగా సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా కబీ సూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధెర్బార్ గ్రామానికి చెందిన బి.ఖలీ పాత్ర.. తన రెండో కుమార్తె బసంతి పాత్రను అదే గ్రామానికి చెందిన కె.దనుపాన్ చిన్న కుమారుడైన కె.గణేశ్ పాత్రకు ఇచ్చి 2020లో వివాహం చేశారు. బసంతి, గణేశ్‌లకు రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న గణేశ్.. ఆమెతో తరచూ గొడవలు పడేవాడు. దీంతో బసంతి తన భర్తపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన గణేశ్.. తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. అయితే, తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని బసంతిపై ఒత్తిడి తెచ్చేవాడు. లేదంటే ఆమెను, రెండేళ్ల కుమార్తెను చంపేస్తానని బెదిరించేవాడు.
విష సర్పాన్ని కొనుగోలు చేసి.. పథకం ప్రకారం హత్య
ఈ క్రమంలోనే.. పూజలు చేస్తానని మాయమాటలు చెప్పి పాములు పట్టే వ్యక్తి వద్ద నుంచి సర్పాన్ని కొనుగోలు చేశాడు గణేశ్. అక్టోబర్ 6న రాత్రి తన భార్య, కుమార్తె నిద్రిస్తుండగా వారిపై విషసర్పాన్ని విడిచిపెట్టాడు. పాము కాటు వేయడం వల్ల.. వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. తన పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన గణేశ్ ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడాడు. అక్టోబర్ 7 తెల్లవారుజామున 5 గంటల సమయంలో పెద్దగా కేకలు వేశాడు. ఆ అరుపులు విని చుట్టుపక్కల వారంతా వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన భార్య, కుమార్తెకు పాము కాటు వేసినట్లుగా అందరినీ నమ్మించడానికి యత్నించాడు.
పాముకాటుకు తల్లి, కుమార్తె బలి
ఆ సమయంలోనే బసంతి తండ్రి.. ఇంటిలోకి వెళ్లి చూడగా ఆ సమయంలో పామును గణేశ్.. కర్రతో కొడుతున్నట్లుగా కనిపించాడు. అతని పక్కనే కుమార్తె, మనవరాలు అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వారిద్దరినీ 108 అంబులెన్స్ సహాయంతో చికిత్స నిమిత్తం హింజిలికట్టు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధరించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం తరలించారు.