దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యను పోలిన ఘటన బంగాల్లో జరిగింది. తండ్రిని హత్య చేసిన కుమారుడు.. ఆరు ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పారేశాడు. అనంతరం తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, కుమారుడిపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో భార్య సహా అతడి కుమారుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బారుయ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఉజ్వల్ చక్రవర్తి.. నేవీలో పనిచేసి 12 ఏళ్ల కింద పదవీ విరమణ పొందారు. అతడి కుమారుడు పరీక్ష ఫీజు కోసం రూ.3వేలు అడగగా.. చక్రవర్తి అందుకు నిరాకరించాడు. దీంతో ఇరువరి మధ్య వివాదం తలెత్తింది. చక్రవర్తి.. కుమారుడిని కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు.. తండ్రిని నెట్టేశాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన చక్రవర్తిని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత బాత్రూమ్కు తీసుకెళ్లి శరీరాన్ని రంపంతో ఆరు ముక్కలు చేశాడు. ఆ శరీర భాగాలను ఓ సంచిలో మూటగట్టి పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు.
యువతిని హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టి
శ్రద్ధా వాకర్ హత్య లాంటి మరో ఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్‌లో జరిగింది. ఓ యువతిని దారుణంగా హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టాడు ఓ వ్యక్తి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఆశిశ్ సాహూను అరెస్ట్ చేశారు. హత్య చేసిన నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు.