పిల్లలే తమ భవిష్యత్‌గా భావించి.. వారి కోసం ఏం చేయడానికైనా తల్లిదండ్రులు వెనకాడరు. అలాంటి ఓ తండ్రి జోరున కురుస్తున్న వానలో చదువుకుంటున్న తన కుమార్తెకు గొడుగు పట్టాడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఈ తండ్రీకూతుళ్ల ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తండ్రి చూపిన చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆన్లైన్ తరగతులకు రోజూ హాజరవుతున్న ఓ విద్యార్థినికి.. గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రోడ్డు పక్కన కూర్చొని తరగతులకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనూ తరగతులకు హాజరవ్వాలనే ఆరాటంతో తండ్రిని వెంట తీసుకెళ్లింది. ఆ వర్షంలో కూతురు మొబైల్లో క్లాసులు వింటుండగా.. తండ్రి గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని క్లిక్‌మనిపించిన ఓ వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.