Eye Vision after 54 years of Birth: సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు పెద్దలు. అంటే అన్ని అవయవాల కంటే కళ్లు ముఖ్యమైనవని అర్థం. కానీ, దేశంలో చాలా మంది పుట్టుకతో చూపు కోల్పోయి జీవనాన్ని సాగిస్తుంటారు. కొందరు కేవలం ఒక కంటితోనే చూడగలుగుతారు. అయితే ఆ కోవకే చెందిన బంగాల్లోని ఓ వ్యక్తి.. 54 ఏళ్ల తర్వాత కుడి కంటి చూపును పొందారు.
జల్పాయ్గుడి జిల్లా రైకత్పరా నివాసి అయిన పార్థ భట్టాచార్య వృత్తిరీత్యా జర్నలిస్టు. ఆయన 7వ తరగతిలో ఉన్నప్పుడు కుడి కన్ను సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వారు భట్టాచార్యను స్థానిక కంటి వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే డాక్టర్.. కుడి కంటితో పూర్తిగా చూడలేరని తెలిపాడు. భట్టాచార్య పేద కుటుంబానికి చెందినవారు. కరెంట్ మీటరు పెట్టించుకునే స్తోమత లేకపోవడం వల్ల నూనె దీపాల సహాయంతోనే చదువుకునేవారు. దీంతో తక్కువ వెలుతురులో చదవడం వల్ల ఆయన కంటి సమస్య మరింత ఎక్కువైంది.
అప్పటి నుంచి భట్టాచార్య దేశవ్యాప్తంగా పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స కోసం నేపాల్‌కు కూడా వెళ్లారు. అయితే మే 5న శిలిగుడిలోని గ్రేటర్ లయన్స్ ఆసుపత్రికి వెళ్లి నేత్ర వైద్య నిపుణుడు క్వాజీ ఆలం నయ్యర్‌ను కలిశారు. ఆపరేషన్ చేస్తే చూపు వచ్చే అవకాశం ఉందని తెలిపిన వైద్యుడు నయ్యర్.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమై చూపును పొందారు భట్టాచార్య.