జూదంలో భార్యను పందెంగా పెట్టి ఓడిపోయాడు ఓ వ్యక్తి. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని లక్సర్‌లో ఈ ఘటన జరిగింది. జూదానికి అలవాటు పడి తనను పందెంగా పెట్టాడని తన భర్తపై ఆరోపణలు చేశారు బాధిత మహిళ. అందులో ఓడిపోవడం వల్ల తనను ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కొత్వాలి ప్రాంతంలో నివసించే ఓ మహిళకు 2021 మార్చిలో ఆసిఫ్‌తో పెళ్లి అయింది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహం కోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు భారీగా ఖర్చు చేశారు. రూ.ఏడు లక్షలు కట్నం ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలు, బైక్ కొనిచ్చారు. అయినప్పటికీ ఆసిఫ్ కుటుంబం సంతృప్తి చెందలేదు.
కారు కొనివ్వాలని ఆమెను వేధించారు. క్రమంగా వేధింపులు ఎక్కువయ్యాయి. బాధితురాలి భర్తకు డ్రగ్స్ అలవాటు ఉంది. జూదం ఆడేవాడు. రోజూ తాగొచ్చి డబ్బుల కోసం గొడవ చేసేవాడు. 2021 నవంబర్‌లో డ్రగ్స్ తీసుకొని తనతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించారు. తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని భర్త సోదరుడు షకీబ్.. తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని మహిళ పేర్కొన్నారు. వీటిపై తన పుట్టింట్లో ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని తెలిపారు. ఇదే క్రమంలో ఓ రోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్ని తన భర్త వెంట తీసుకొచ్చాడని.. జూదంలో ఓడిపోయినందున వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు. దీనికి నిరాకరించినందుకు భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని మహిళ తెలిపింది. తనకు న్యాయసహాయం అందించాలని అభ్యర్థించింది.
రూ.1.80 కోట్లు కాజేసి...
మరోవైపు.. రెండో పెళ్లి చేసుకోవాలన్న 70ఏళ్ల వ్యక్తికి.. ఓ మహిళ షాక్ ఇచ్చింది. రూ.1.80 కోట్లు తన ఖాతాలోకి బదిలీ చేయించుకొని పరార్ అయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరిగింది. కార్డియాలజిస్ట్‌గా పనిచేసే బాధితుడు భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. రెండో పెళ్లి చేసుకుందామని భావించి న్యూస్పేపర్లో యాడ్ ఇచ్చాడు. చాలా ప్రపోజల్స్ వచ్చాయి.