రాజస్థాన్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కోడలితో కలిసి పారిపోయాడు. అంతే కాకుండా కొడుకు బైక్ను కూడా తీసుకెళ్లిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న కొడుకు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత సంఘటన బుందీ జిల్లాలోని సిలోర్ గ్రామంలో జరిగింది.
గ్రామంలో బాధితుడు పవన్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి తన భార్యకు ఏవో మాయ మాటలు చెప్పి.. ఆమెను తీసుకొని పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అమాయకురాలని, తనకు అలా వెళ్లేంత తెలివి కూడా లేదని వాపోయాడు. తన తండ్రే ఏదో మోసం చేసి తన భార్యను తీసుకొని పారిపోయాడని ఆరోపించాడు. అదేగాక తన బైక్ను కూడా తీసుకెళ్లిపోయాడని చెప్పాడు.
'నా తండ్రి డబ్బు సంపాదించడం కోసం కొన్ని చట్టవిరుద్ధ పనులు చేశాడు. నేను పని నిమిత్తం సొంత గ్రామానికి దూరంగా ఉంటున్నాను. అయితే నా తండ్రి.. నా భార్యను తీసుకెళ్లడమే కాకుండా బైక్ను కూడా అపహరించి తీసుకెళ్లాడు. తన తండ్రి ఆమెను ఎలా ఆకర్షించాడో తెలియడం లేదు. కానీ నా భార్య చాలా అమాయకురాలు. నా తండ్రి బలవంతం చేయకుంటే ఆమె ఈ పని చేసుండేది కాదు' అని పవన్ చెప్పుకొచ్చాడు.
తన కేసును పోలీసులు సీరియస్గా తీసుకోలేదని పవన్ ఆరోపించారు. పవన్ ఆరోపణలపై సదరు స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ స్పందించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, దొంగిలించిన ద్విచక్ర వాహనంతో పాటు పారిపోయిన ఇద్దరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరి ఆచూకీకి సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు.
తమిళనాడులో విద్యార్థికి ప్రేమ పాఠాలు
ఇలాంటి ఘటనే ఇటీవల తమిళనాడులో జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు చెప్పి 17ఏళ్ల మైనర్ బాలుడిని తీసుకొని పారిపోయింది. తిరుచునాపల్లిలోని ఒక పాఠశాలలో టీచర్(26) మైనర్ బాలుడితో సన్నిహితంగా ఉండి ప్రేమ కలిగేలా చేసింది. తరచూ ఫోన్లు మాట్లాడుతూ మరింత దగ్గరయ్యారు. ఒకరోజు ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. మైనర్ కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న టీచర్ను అరెస్టు చేశారు.
ఇద్దరు మైనర్ల పెళ్లి
ఇటీవల.. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన ఇద్దరు మైనర్లు చదువుకునే వయసులోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ పంజాబ్ నుంచి పారిపోయి బిహార్లోని జముయీకి వెళ్లారు. ఆరునెలల పాటు ఇద్దరూ జీవనం సాగించారు. వారి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి జంట మైనర్లు కావడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు.