మనిషికే కాదు ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ప్రేమ ఎంతో అవసరం. అయితే మనుషులు తమ వారిపై ప్రేమను చూపటంలో ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఈ మాటల్ని నిజం చేస్తూ జీవితంలో నిజమైన ప్రేమ వల్ల ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు .. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ప్రాణంగా ప్రేమించిన తన భార్య ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లినా.. తన నూతన గృహంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేసుకుని.. అర్ధాంగిపై అభిమానం ఘనంగా చాటుకున్నాడు.
కొప్పల్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త అయిన శ్రీనివాస గుప్తాకు భార్య అంటే ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు మహారాణిలా చూసుకున్నాడు. 2017లో జరిగిన కారు ప్రమాదంలో భార్య మాధవి మరణించింది. ఆమె లేకున్నా.. ఇంట్లో ఆమె ఉనికి ప్రతిబింబించేలా డ్రాయింగ్ రూంలో మాధవి కూర్చున్నట్లు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
తిరుపతికి వెళుతున్నప్పుడు నా భార్య మాధవి ప్రమాదంలో మరణించారు. ఆమె కోరిక, ఆలోచనలకు అనుగుణంగా నూతన గృహం నిర్మించాం. ఆమె మధుర స్మృతులకు గుర్తుగా ఈ విగ్రహం ఏర్పాటు చేశాం.
-- కె.శ్రీనివాస గుప్తా
జూలై 5, 2017న శ్రీనివాస గుప్తా .. కుటుంబంతో తిరుపతి వెళుతున్న సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే కొప్పల్ పట్టణంలో ఇల్లు కొనాలనే కోరిక మాధవికి ఉండేది. ఆమె మరణం తరువాత గుప్తా మాధవి కలల గృహాన్ని నిర్మించాడు. ఆమె జ్ఞాపకార్థం భారీ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాడు.
"మా అమ్మ విగ్రహం సిలికాన్‌తో తయారు చేశారు. మాకు దూరమైన ఆమెను ఇలా చూసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మా తల్లి మాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది అధునాతన సాంకేతిక విగ్రహాలలో ఒకటి."