24 ఏళ్లుగా కొబ్బరే ఆహారం.. 63 ఏళ్ల వయసులోనూ యువకునిలా జీవనం Man Eats Only Coconuts: కేరళకు చెందిన బాలక్రిష్ణన్ పాలై అనే వ్యక్తి 24 ఏళ్లుగా కొబ్బరి తింటూ బతుకుతున్నారు. 63 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉంటూ.. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారు. ఇప్పటికీ పోలీసు ఉద్యోగార్థులకు శిక్షణనిస్తున్నారు.
24 ఏళ్లుగా కొబ్బరే ఆహారంగా తీసుకుంటున్న కేరళవాసి కేరళలోని కాసర్గడ్కు చెందిన బాలక్రిష్ణన్ పాలై మొదట్లో కేరళ పోలీసు విభాగంలో, తర్వాత కొంతకాలం.. రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసే సమయంలో బాలక్రిష్ణన్ వివిధ రకాల వంటకాలకు ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఓ రోజు ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఆయన అన్నవాహికకు అరుదైన వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి బాలక్రిష్ణన్ జీర్ణవ్యవస్థ క్రమంగా నెమ్మదించింది. ఏదైనా ఆహారం తిన్నా అది జీర్ణ కావడానికి చాలా సమయం పట్టడం సహా.. తిన్న ప్రతిసారి అస్వస్థతకు గురయ్యేవారు. అన్నం తినడం క్రమంగా తగ్గిస్తూ వచ్చిన బాలక్రిష్ణన్ నెమ్మదిగా లేత కొబ్బరిని తినడం ప్రారంభించారు. అలా 24 ఏళ్లుగా కొబ్బరి తప్ప మరేది తినకుండా జీవనం సాగిస్తున్నారు.
నిత్య యవ్వనంగా క్రీడల్లో రాణిస్తున్న బాలక్రిష్ణన్ పాలై Coconut Benefits For Body: ప్రతిరోజూ రెండు కొబ్బరి బొండాలను కొనుగోలు చేసి వాటినే ఆహారంగా తీసుకుంటానని బాలక్రిష్ణన్ పాలై అన్నారు. 24 ఏళ్ల నుంచి ఏనాడు అనారోగ్యం బారిన పడలేదని చెబుతున్నారు. 63ఏళ్ల వయసులోనూ పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు పాలై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణార్థులతో పాటు ఆయన కూడా అలుపులేకుండా కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. మరోవైపు జాతీయ,అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణిస్తున్నారు. 2010లో తన 52 ఏళ్ల వయసులో మలేసియాలో జరిగిన మాస్టర్స్ మీట్‌లో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పాల్గొని పతకాలు సాధించారు. వీటితో పాటు రాష్ట్రస్థాయి క్రీడల్లోనూ పాల్గొన్న బాలక్రిష్ణన్.. అనేక మెడల్స్ గెలుచుకున్నారు. బాలక్రిష్ణన్ దగ్గర శిక్షణ పొందిన కాసర్గడ్, కన్నూర్ ప్రాంతాల్లోని చాలామంది ప్రస్తుతం ఉన్నతస్థాయిలో ఉన్నారు.
ఇదీ చదవండి:ఘనంగా 'ప్రేమికుల జాతర'.. తరలివచ్చిన లవర్స్!