Man Cuts Nose Of Anganwadi Woman :అంగన్వాడీకి వచ్చే పిల్లలు తన ఇంటి ఆవరణలో పెరిగిన పూలను కోశారని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ అంగన్‌వాడీ సహాయకురాలి ముక్కును కోసేశాడు. ఈ అమానుష ఘటన కర్ణాటక బెళగావి జిల్లాలోని బసుర్తే గ్రామంలో జరిగింది. ఈనెల 1న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
సుగంధ మోరే (50) అనే మహిళ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంటికి ఆనుకొని ఈ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. రోజులాగే పిల్లలు కూడా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో వారు ఆడుకుంటుండగా కేంద్రం పక్కన్నే ఉన్న ఇంటి బయట పూసిన పూలను తెంపారు. ఇది చూసిన ఇంటి యజమాని కల్యాణి మోరే కోపంతో రగిలిపోయాడు. వెంటనే పిల్లలపై ఉన్న కోపాన్ని కేంద్రంలో పనిచేస్తున్న సుగంధపై చూపించాడు. ఆమెను విపరీతంగా దూషించాడు. అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ముక్కు కోశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన సుగంధను బెళగావి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు.
ఊపిరితిత్తులపై ఎఫెక్ట్
ముక్కుపై దాడి చేయడం వల్ల ఆ ప్రభావం ఆమె ఊపిరితిత్తులపై పడింది. దీంతో ఆమె లంగ్స్లో రక్తస్రావం జరిగి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. ఇక బాధితురాలు సుగంధ మోరే భర్త దివ్యాంగుడు. అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా ఆమెపై జరిగిన ఘటనకు సంబంధించి కాకతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పొలం పంచాయితీ- మహిళను వివస్త్రను చేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ
Woman Allegedly Assaulted By Stripping Her : ఇదే బెళగావి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. పొలం విషయంలో తలెత్తిన సమస్య కారణంగా ఓ మహిళను ఒకేరోజు రెండుసార్లు అర్ధనగ్నంగా వివస్త్రను చేసి, అసభ్య పదజాలంతో దూషించి హింసించారు కొందరు. ఈ ఘటనలో మహిళల పాత్ర కూడా ఉండడం గమనార్హం.