ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో భార్య గర్భిణీ అనే దయాదాక్షిణ్యాలు లేకుండా పాశవికంగా ప్రవర్తించాడు ఓ భర్త. హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదితో ఆమెకు ఇంజెక్షన్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో లోధా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురి అత్తమామలతో పాటు ఆస్పత్రి యజమాని ఈ కుట్రలో భాగస్వాములని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులే అని చెప్పారు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహేష్ గౌతమ్.. జిల్లా ఆస్పత్రిలోని ల్యాబ్‌లో కాంట్రాక్టు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 7న ఇతనికి వివాహమైంది. అయితే తన భర్తకు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని భార్యకు తర్వాత తెలిసింది. ఈ విషయంపై ఆమె నిలదీసినప్పటి నుంచి విడాకులు కావాలని అతడు వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు హెచ్ఐవీ సూదితో ఇంజెక్షన్ చేశాడు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచే తన భర్త హెచ్ఐవీ అంటించేందుకు ప్రయత్నిస్తున్నాడని భార్య ఆరోపించింది.