కన్న తండ్రినే హత్య చేయించింది ఓ కుమార్తె. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటలో జరిగింది. ఈ కేసులో మృతుడి కుమార్తె శివాని మీనా, ఆమె ప్రియుడు అతుల్ మీనా, లలిత్ మీనా, విష్ణు భీల్, విజయ్ మాలి అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే:రాజేంద్ర మీనా(47) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన బిస్లాయ్ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. రాజేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు మద్యానికి కావడం వల్ల.. అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సుల్తాన్‌పుర్‌లోని తన మొదటి భార్య కోసం ఇంటిని అమ్మాలని అనుకున్నాడు. ఇల్లు అమ్మడం నచ్చని.. అతని కూతురు.. తండ్రి హత్యకు ప్రణాళిక వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చి.. తండ్రిని హత్య చేయించింది. జూన్ 25న బైక్ మీద వస్తుండగా.. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేసి రాజేంద్రను హతమార్చారు. రాజేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. కుమార్తే సూత్రదారి అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు.
పబ్జీకి బానిసై:రెండు రోజుల క్రితం హత్యకు గురైన బాలుడి కేసులో పురోగతి లభించింది. పబ్జీకి బానిసైన కోచింగ్ సెంటర్ యజమాని మనవడు అరుణ్ శర్మ(18) హత్య చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. పబ్జీ వద్దంటున్న తన తాత, అమ్మమ్మను జైలుకు పంపేందుకు అతను ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియాలో జరిగింది.
జరిగింది ఇదీ..: లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ఖోలి గ్రామానికి చెందిన బాలుడు సంస్కార్ యాదవ్ (6).. ప్రతి రోజు ఉదయం కోచింగ్ సెంటర్‌కు వెళ్లేవాడు. బుధవారం కూడా అలా వెళ్లిన సంస్కార్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని తండ్రి, కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపించక పోవడం వల్ల కోచింగ్ సెంటర్‌కు వెళ్లి ఆరా తీశారు. ఆ రోజు కోచింగ్ సెంటర్ రాలేదని వారికి తెలిసింది. సాయంత్రం సమయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఓ లేఖ అందింది. రూ.5 లక్షలు సిద్ధం చేసుకోవాలని.. లేదంటే మీ బిడ్డను హత్య చేస్తామని ఆ లేఖలో ఉంది. వెంటనే మృతుడి తండ్రి గోరఖ్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు బుధవారం రాత్రంతా నిందితుల కోసం వెతికారు. గురువారం ఉదయం కోచింగ్ టీచర్ ఇంట్లోని టాయిలెట్లో శవమై కనిపించాడు సంస్కార్ యాదవ్. కోచింగ్ టీచర్ మనువడు అరుణ్ శర్మ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. బాలుని గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.