మహిళను గుడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లిన ధర్మకర్త కర్ణాటకలో గుడికి వచ్చిన ఓ మహిళ పట్ల ఆలయ ధర్మకర్త విచక్షణారహితంగా వ్యవహరించి దాడి చేశాడు. నల్లగా, వింతగా ఉన్నావంటూ దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇనుప రాడ్తో దాడి చేయగా.. పూజారి అడ్డుకోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ ఘటన డిసెంబర్ 21న జరగగా.. మహిళ, ధర్మకర్త పరస్పర ఫిర్యాదులతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే..?
బెంగళూరు అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో డిసెంబర్ 21న ఈ దారుణం జరిగింది. ఓ మహిళ గుడికి వెళ్లగా.. ఆలయ ధర్మకర్త మునికృష్ణప్ప ఆమెపై దాడికి దిగాడు. ఆమెను గుడి బయటకు గెంటేశాడు. ఈ ఘటన మొత్త సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీనిపై అమృతహళ్లి పోలీస్స్టేషన్లో జనవరి 5న కేసు నమోదైంది. దీనిపై పూర్తి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
"నేను గృహిణిని. నా భర్త, ఇద్దరు కుమారులతో అమ్మతహళ్లిలో ఉంటున్నాను. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లగా.. అక్కడ ధర్మకర్త మునికృష్ణప్ప నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. 'స్నానం చేయకుండా, శుభ్రం చేసుకోకుండా గుడికి వస్తారా? మీరు ఇక్కడ సందర్శించడానికి అనుమతిలేదు'. 'నల్లగా వింతగా ఉన్నావు' అంటూ దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో దాడిచేయగా ఆలయ పూజారి అడ్డుకున్నారు. ఆ తర్వాత నా జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా భర్తను చంపేస్తానని బెదిరించాడు" అని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. "నేను భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇలా జరిగిన విషయం నా భర్తకు కూడా తెలుసు. పోలీసులు మాకు రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చిన తర్వాతే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశా" అని బాధత మహిళ తెలిపింది.
దేవుడే నా భర్త..
ఆలయ ధర్మకర్త మునికృష్ణప్ప వాదన మరోలా ఉంది. "ఆ మహిళ గుడికి వచ్చి.. దేవుడు నా మీదకు వచ్చాడు. వెేంకటేశ్వరుడే నా భర్త. నేను గర్భగుడిలో కూర్చోవాలని చెప్పింది. అందుకు పూజారులు అనుమతించలేదు. అప్పుడు ఆ మహిళ కోపంతో పూజారిపై ఉమ్మి వేసింది. ఎన్ని సార్లు చెప్పినా ఆమె వినకపోవడం వల్ల బయటకు ఈడ్చుకువెళ్లా" అని చెప్పాడు ఆలయ ధర్మకర్త మునికృష్ణప్ప.