Man Enters Mamata Banerjee Residence : బంగాల్ సీఎం మమతాబెనర్జీ నివాసం వద్ద తీవ్ర కలకలం రేగింది. ఆయుధాలతో కూడిన కారుతో మమత నివాసంలోకి చొరబడేందుకు యత్నించిన అనుమానిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ర్యాలీలో పాల్గొనేందుకుగాను మమత తన నివాసం నుంచి బయల్దేరడానికి కొన్నిగంటల ముందు ఈ ఘటన జరిగింది. అనుమానితుడిని నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు.
కోటు, టై ధరించిన అనుమానితుడు.. పోలీస్ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో కోల్‌కతా కాళీఘాట్‌లోని మమత నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో మమత నివాసంలో ఉన్నట్లు చెప్పారు. అనుమానిత వ్యక్తిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అతని వద్ద ఓ చాకుతోపాటు ఇతర ఆయుధాలు, గంజాయి దొరికినట్లు చెప్పారు. అనుమానితుడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మమత నివాసం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
కేంద్రంపై మమత ఫైర్..
Mamata Banerjee On BJP : మరోవైపు, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మరోసారి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీవిమర్శలు గుప్పించారు. అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపుర్‌కు కేంద్ర బృందాలను ఎందుకు పంపలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ 'బేటీ బచావో' నినాదం కాస్త ఇప్పుడు 'బేటీ జలావో'గా మారిందని ఎద్దేవా చేశారు. అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా మమతా బెనర్జీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
"మణిపుర్లో హింస వల్ల ఇప్పటివరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర బృందాలను ఎందుకు ఆ రాష్ట్రానికి ఇంతవరకు పంపలేదు. మణిపుర్ ప్రజలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. బంగాల్‌కు పలు కేంద్ర బృందాలను( పంచాయతీ ఎన్నికల తర్వాత) కేంద్ర ప్రభుత్వం పంపింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌కు ఎందుకు పంపలేదు. బీజేపీని అధికారంలో నుంచి దింపడమే ప్రతిపక్ష కూటమి ఇండియా(INDIA) లక్ష్యం."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
Mamata Banerjee India Alliance : 2024లో ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమి ఇండియాకు బీజేపీని గద్దె దించడం తప్ప.. వేరే లక్ష్యం లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని మమత అన్నారు. 26 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.