ఎంత మధురమైన గాత్రం..! ఈమె పాడుతున్న పాటను.. ఎవరైనా ఆదమరిచి వినాల్సిందే. జగన్నాథస్వామిని రెండు చేతులు జోడించి పూజిస్తున్న యువతీ.. ముఖానికి హిజాబ్ ధరించి, ఖాళీ చేతులతో అల్లాను ప్రార్థిస్తున్న యువతి.. ఇద్దరూ ఒకటే. అన్ని మతాల దేవుడూ ఒక్కటే అని నమ్మే ఈమె పేరు మాముని ఖాతూన్. ఒడిశా, బాలాసోర్ జిల్లాలోని సునారుయ్ గ్రామం ఈమె స్వస్థలం. ముస్లిం ఇంట్లో పుట్టిపెరిగినా.. జగన్నాథ స్వామిని నిత్యం పూజిస్తుంది మాముని.
చిన్నప్పటినుంచీ మామునికి హిందువుల పౌరాణిక గ్రంథాలు, వేదాలు చదవడమంటే విపరీతమైన ఆసక్తి. గాయంత్రిమంత్రం కళ్లుమూసుకుని పఠించగలదు. వినాయకుడి పూజలు సహా.. సంస్కృత మంత్రాలు మొత్తం చదివేస్తుంది మాముని.
"పుట్టుకతో నేను ముస్లిం అయినా.. జగన్నాథుడు అంటే నాకు చాలా భక్తి. ఆయన్ను పూజిస్తాను కూడా. ముస్లిం అయితే మాత్రం ఏంటి? అన్ని మతాల దేవుళ్లూ ఒక్కటే కదా! భజనలు కూడా పాడతాన్నేను. సంస్కృతంలో హానర్స్‌లో పాస్ అయ్యా. భవిష్యత్తులో సంస్కృత అధ్యాపకురాలు కావాలన్నదే నా లక్ష్యం."
-మాముని ఖాతూన్
జ్ఞానం లేకపోతే.. ఎంతటి శారీరక సౌందర్యమైనా ఒట్టిదేనని చెప్తోంది మాముని.
"ఒకరు చూసేందుకు ఎంత అందంగానైనా ఉండొచ్చు.. విజ్ఞానం లేకపోతే మాత్రం అదంతా వొట్టిదే. ఎవరూ మెచ్చుకోరు."
-మాముని ఖాతూన్