సీతల్కుచిలో కాల్పుల ఘటనకు సంబంధించి భాజపా విడుదల చేసిన ఓ ఫోన్ కాల్ ఆడియో కలకలం రేపుతోంది. కాల్పుల్లో మృతి చెందిన నలుగురి మృతదేహాలతో ర్యాలీలు నిర్వహించాలని సీతల్కుచి తృణమూల్ అభ్యర్థికి మమతా బెనర్జీ చెప్పడం.. ఇందులో వినిపించింది.
సీతల్కుచి టీఎంసీ అభ్యర్థి పార్థ ప్రతిమ్ రాయ్, మమతా బెనర్జీకి మధ్య సంభాషణ జరిగినట్లు ఉన్న ఈ ఆడియోను భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా విడుదల చేశారు. మృతదేహాలతో ర్యాలీలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లర్లకు ప్రేరేపించారని మాల్వియా ఆరోపించారు.
రాబందుల సంస్కృతిని బంగాల్లో అధికార పార్టీ అనుసరిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
"రాజకీయ లబ్ధి కోసం మృతదేహాల మీద పడి దోచుకు తినే రాబందుల సంస్కృతిని టీఎంసీ అనుసరిస్తోంది. ఇందుకు టీఎంసీ సిగ్గుపడాలి."
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు