గాయమైన కాలు కదిపిన మమత!: వీడియో వైరల్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చక్రాల కుర్చీలో కూర్చొని.. కట్టుకట్టి ఉన్న కాలును ముందుకూ వెనక్కీ ఊపుతున్న 30 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఆమె కాలుకు గాయమేమీ కాలేదని చెబుతున్న భాజపా ఇప్పుడు మాటల దాడిని మరింత తీవ్రతరం చేసింది. మమత కాలు ఊపుతున్న వీడియో క్లిప్‌ను భాజపా అధికార ప్రతినిధి ప్రణయ్ రాయ్ ఫేస్‌బుక్ ద్వారా ఇతరులతో పంచుకున్నారు.
'నాటకాలకు తెరదించాలి'
ఈ వీడియోను కొందరు తృణమూల్ కార్యకర్తలే చిత్రీకరించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గాయాల పేరుతో నాటకాలను మమత ఆపాలి. ఆమె సత్వరం సాధారణ జీవితం గడపాలని మేం ప్రార్థనలు చేస్తున్నాం. చక్రాల కుర్చీలో తిరగడమనే నాటకానికి మాత్రం ఆమె తెరదించాలి. కాలుకు వ్యాయామం చేస్తున్నట్లయితే ఆమె నడవడమే ఉత్తమం. దాని ద్వారానే వేగంగా కోలుకుంటారు’ అని ప్రణయ్‌రాయ్ అన్నారు. ఓటమి భయం పెరుగుతున్న కొద్దీ మమత బ్యాండేజి పరిమాణం పెరుగుతోందని, దానివల్ల ఓట్లు మాత్రం రాలవని భాజపా సీనియర్‌నేత రాహుల్‌సిన్హా అన్నారు.
భాజపా వ్యాఖ్యల్ని తృణమూల్ ఖండించింది. విమర్శలతో మమతనే కాకుండా బంగాల్ మహిళలందరినీ అవమానించినట్లేనని పేర్కొంది. మమత విషయంలో వైద్యులు సహా అందరూ ఎలా అబద్ధాలు చెబుతారని ఇటీవల తృణమూల్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా ప్రశ్నించారు.
ఇదీ చదవండి :బంగాల్ నాలుగో దశలో 22% అభ్యర్థులు నేరచరితులే..