తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమత మళ్లీ గెలిస్తే జాతీయ ప్రాధాన్యమే! - బంగాల్ ఎన్నికలు

బంగాల్​లో మమత బెనర్జీ మూడోసారి కూడా జయభేరి మోగిస్తే- జాతీయ స్థాయిలో ఆమె పాత్ర, ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. కాంగ్రెస్​ దినదినం పట్టుకోల్పోతున్న వేళ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని టీఎంసీ భావిస్తోంది. మరోవైపు స్టాలిన్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల మద్దతుతో మరో ప్రత్యమ్నాయంగా ఎదిగేందుకు మమతకు సువర్ణావకాశం ఉంది.

mamata to emerge as national leader
మమత.. మళ్లీ గెలిస్తే జాతీయ ప్రాధాన్యమే!

By

Published : Mar 30, 2021, 8:03 AM IST

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా భాజపా హోరాహోరీ పోరు సాగిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన మమత ముచ్చటగా మూడోసారి సైతం విజయభేరి మోగిస్తే- జాతీయ స్థాయిలో ఆమె పాత్ర, ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా అన్ని పక్షాలను కూడగట్టాలనే మమత కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీని, కేంద్ర సర్కారు విధానాలను నిరంతరం తూర్పారపట్టడం ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేస్తూనే ఉన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు మొదలు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు, జీఎస్టీ ఆదాయ పంపకం, పౌరసత్వ సవరణ చట్టం, అఖిల భారత సర్వీసు అధికారుల డిప్యుటేషన్‌, కేంద్ర నిధులతో కూడిన సంక్షేమ పథకాలు తదితర అంశాల్లో మమత కేంద్ర సర్కారుపై విమర్శల దాడులు చేస్తూనే వచ్చారు.

భాజపా, తృణమూల్

మరో ప్రత్యామ్నాయం..

జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ మరింత కీలక పాత్ర పోషించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆశించడానికి ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీయే కారణమవుతోందనే అభిప్రాయాలున్నాయి. భాజపాకు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా రోజురోజుకు క్షీణిస్తుండటం వల్ల ఆ స్థానాన్ని భర్తీ చేయాలని తృణమూల్‌ నేతలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన సుదీర్ఘ మిత్రులైన వామపక్షాలను జత చేర్చుకుని బంగాలు ఎన్నికల్లో తృణమూల్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ, విపక్షం రెండూ భాజపా వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నాయనే అభిప్రాయాలూ లేకపోలేదు. కొన్నేళ్లుగా హిందూత్వ, జాతీయవాదాన్ని ప్రచారం చేస్తూ పశ్చిమ్‌ బంగలో ముందుకు సాగుతున్న భాజపా- వాటి నుంచి ప్రయోజనం పొందుతోంది. 2019లో 42 లోక్‌సభ స్థానాలకుగాను 18 సీట్లు భాజపా గెలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అప్పటి నుంచీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి దూకుడును పెంచింది. జైశ్రీరాం నినాదం చుట్టూ ప్రచారాన్ని కేంద్రీకరిస్తున్న కమలం పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, శాంతిభద్రతల లోపం వంటి అంశాలను తన ప్రచార పర్వంలో ప్రముఖంగా చాటుతోంది.

పట్టు సడలని భాజపా..

మరోవైపు బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భాజపా నేతలను ఎదుర్కొనేందుకు స్థానికులు, బయటివారి మధ్యే పోటీ అంటూ సరికొత్త ప్రచారాస్త్రానికి పదును పెట్టారు. తనను తాను బంగాల్‌ బిడ్డగా ప్రచారం చేసుకుంటున్నారు. కొంతకాలంగా పలువురు తృణమూల్‌ నేతలను ఆకర్షిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటున్న భాజపాను ఎదుర్కొనేందుకు ఈ తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. బంగాల్​లో గణనీయ మార్పు సాధించేందుకు బలమైన పోటీదారు భాజపాయేనన్న సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు కమలదళం ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది.

బంగాల్ రాజకీయాల్లో మమతకు వీధి పోరాట యోధురాలిగా పేరుంది. ఈసారి ఆమె సర్వశక్తులూ కూడదీసుకుని భాజపాతో పోరాటానికి సిద్ధమయ్యారు. చక్రాల కుర్చీలో కూర్చొని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి దిగి భాజపా ఎన్నికల వ్యూహాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కాలికి గాయమైన ఉదంతానికి సంబంధించి... తనపై దాడి జరిగిందంటూ మమత చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం, భాజపా ఖండించాయి. ఏదేమైనా, మమత కాలికి చికిత్స నిమిత్తం వేసిన కట్టు బలమైన ప్రతిస్పందనకు సంకేతంగా ఆమె సానుభూతిపరులను ఆకర్షించింది. ఇది కొంతమేర అదనపు ఓట్లను తృణమూల్‌ వైపు మరల్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

మమత బెనర్జీ

మిత్రలాభం..

మొత్తానికి... బంగాల్​లో సంస్థాగతంగా అంతంత మాత్రంగానే బలం కలిగిన భాజపా అత్యంత దూకుడును ప్రదర్శిస్తోంది. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తన బలహీనతల్ని అధిగమించేందుకు తీవ్రస్థాయిలో యత్నిస్తోంది. ఇందుకోసం స్థానికంగా బలమైన నేతల కోసం అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌కే గాలం వేస్తోంది. ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్య మమత మూడోసారి ఒంటిచేత్తో తన పార్టీ తృణమూల్‌ను గెలిపించి, ముఖ్యమంత్రి పదవిని మరోసారి చేపడితే- దేశవ్యాప్తంగా భాజపా విజయ ప్రస్థానాన్ని నిలువరించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో విపక్షాలకు అవసరమైన నాయకత్వాన్ని అందించేందుకూ సరిపోతారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి కాంగ్రెస్‌ నుంచి పెద్దగా సానుకూల ప్రతిస్పందన లేకపోయినా ఇతర పార్టీలు మాత్రం అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌, దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీపార్టీ అగ్రనేత అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తదితర నేతల అండదండలు ఇప్పటికీ మమతకే ఉన్నట్లు తెలుస్తోంది.

- అమిత్‌ అగ్నిహోత్రి

ఇదీ చూడండి:మమతXసువేందు: నందిగ్రామ్​లో మాటల తూటాలు

ABOUT THE AUTHOR

...view details