బంగాల్లో పోలింగ్ తీరుపై ఎన్నికల సంఘాన్ని విమర్శించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సూచనలతోనే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా.. అధికారులు తగు చర్యలు తీసుకోట్లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈసీకి 63 ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
నందిగ్రామ్‌లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు మమత. బోయల్ ప్రాంతంలోని బూత్ నెం.7 బయట వీల్‌ఛైర్‌లో కూర్చుని ఈ వ్యాఖ్యలు చేశారు.
''మేం ఉదయం నుంచి 63 ఫిర్యాదుల్ని నమోదు చేశాం. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ అంశంపై మేం కోర్టుకెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.''
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
గవర్నర్‌కు ఫోన్..
నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దీదీ.. అక్కడి నుంచే గవర్నర్ జగదీప్ దన్ఖర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ''ఉదయం నుంచి స్థానికులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. మీరే జోక్యం చేసుకోవాలి.'' అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు మమత.