బంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అది కేంద్రం నిబద్ధతగా పేర్కొన్నారు. రాజకీయ హత్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల వివరాలను జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ)కి ఎందుకు పంపటం లేదో ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
బంగాల్ పర్యటనలో భాగంగా కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతపై విమర్శలు గుప్పించారు షా.
" కొత్త తరం అభివృద్ధితో బలమైన బంగాల్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, మమతా బెనర్జీ తన మేనల్లుడిని తదుపరి ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2018 నుంచి బంగాల్ ప్రభుత్వం నేర వివరాలను ఎన్సీఆర్బీకి పంపటం లేదు. రాజకీయ హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మమతా బెనర్జీని కోరుతున్నా. ఈ నేరాల్లో బంగాల్ తొలిస్థానంలో ఉంది. "