Bengal Cabinet Reshuffle: బంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి పార్థా ఛటర్జీ రూపంలో మరో అవినీతి మరక అంటుకున్న నేపథ్యంలో.. ఆ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించింది. ఐదుగురు కొత్తవారికి మంత్రులుగా చోటు కల్పించింది. వీరిలో భాజపాకు చెందిన మాజీ కేంద్రమంత్రి, గతేడాది టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియోకు చోటు కల్పించడం విశేషం. సుప్రియోతోపాటు స్నేహశిక్ చక్రవర్తి, పార్థా భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదిబ్ మజుందార్‌లకు మంత్రులుగా హోదా కల్పించింది. సహాయ మంత్రులుగా బిర్బాహా హన్స్‌దా, బిప్లబ్ రాయ్ చౌదరి, తజ్ముల్ హొస్సేన్, సత్యజిత్ బర్మన్‌ను ఎంపిక చేశారు. 2011లో బంగాల్ పగ్గాలను టీఎంసీ చేపట్టాక కేబినెట్‌లో జరిగిన అతిపెద్ద మార్పు ఇదే. వీరంతా బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు.
ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో పార్థా ఛటర్జీతో పాటు మరో ఇద్దరిని గత వారం ఈడీ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో రూ.50కోట్లకు పైగా నోట్ల కట్టలు, బంగారం, కీలక దస్త్రాలు బయటపడ్డాయి. నేపథ్యంలో పార్థా ఛటర్జీని మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు దీదీ ప్రకటించారు. ఆయన నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను తాను చేపడతానని చెప్పారు.
పార్థా ఛటర్జీ వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరిస్తే అటు అవినీతిని సహించేది లేదన్న సంకేతాలను జనంలోకి పంపించడంతో పాటు పార్టీ ఇమేజ్ మరింత దిగజారకుండా చూసుకోవాలన్నది దీదీ ప్లాన్‌గా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.