ఆమె.. ప్రస్తుతం దేశంలోనే ఏకైక మహిళా సీఎం. దేశంలో ఘన చరిత్ర ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లుగా పాలిస్తూ.. దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన వ్యక్తి. ఏది ఏమైనా.. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. దేశంలో 'మోదీ' సునామీకి అడ్డుకట్ట వేసేందుకు విపక్షాల వద్ద ఉన్న ప్రధాన అస్త్రం ఆమె. ఆమే.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఎవరినైనా ఢీ కొట్టగలిగే ధైర్యం దీదీ సొంతం. ప్రజా నేతగా, ప్రజల మనిషిగా మమతకు ఎంతో గుర్తింపు కూడా ఉంది. పట్టు వదలకుండా.. పార్టీని భుజాలపై మోస్తూ ఇన్నేళ్లుగా బంగాల్‌ను ఏకపక్షంగా ఏలారు మమత. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బంగాల్ గోడలు బద్దలుకొట్టుకుని అనూహ్యంగా దూసుకొచ్చిన 'భాజపా' తుపాను ధాటికి పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. సిద్ధాంత లేమితో సతమతమవుతున్న పార్టీకి.. 'వలస' రూపంలో మరో సమస్య ఎదురైంది. ఇన్ని క్లిష్టపరిస్థితుల మధ్య ఎన్నికలకు వెళుతోంది తృణమూల్ కాంగ్రెస్. మరి భాజపాను తట్టుకుని నిలుస్తుందా? మమత.. మరోమారు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా?
ఎదురులేని స్థితి నుంచి..
1998లో కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్. 2001, 2006లో పోటీ చేసినప్పటికీ.. ఫలితం దక్కలేదు. కానీ.. 'నందిగ్రామ్ ఉద్యమం'తో 2011లో వామపక్షాల కంచుకోట అయిన బంగాల్‌ను కూల్చి.. పార్టీ జెండాను ఎగురవేసింది టీఎంసీ.
ఆ తర్వాత మమతా బెనర్జీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2016 నాటికి బంగాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఆ ఎన్నికల్లో.. 294కు గానూ.. 211 సీట్లను కైవసం చేసుకున్నారు. దేశంలోనే శక్తిమంతమైన నేతగా మమత ఎదిగారు. పార్టీనీ అదే స్థాయిలో నిలబెట్టారు.
టీఎంసీ సుప్రీమో మమతా బెనర్జీ కంచుకోటకు బీటలు...
ఎదురులేని ఆధిపత్యం సాధించిన మమతకు 'భాజపా' రూపంలో సవాలు ఎదురైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్లో కమలదళం అనూహ్య రీతిలో పుంజుకుంది. 42 సీట్లలో 18 దక్కించుకుంది. ఈ సంఖ్య.. టీఎంసీ కన్నా 4 మాత్రమే తక్కువ కావడం గమనార్హం. రాష్ట్రంలో భాజపా ఎదుగుదలకు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణుల్లో కలిగిన విశ్వాసానికి పునాది పడింది అక్కడే.
ఇదీ చూడండి:-కౌన్ బనేగా బంగాల్ టైగర్?
ఆ తర్వాత భాజపా వేగంగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు పక్కా ప్రణాళికలు రచించింది. టీఎంసీ శ్రేణుల గుండెల్లో గుబులు రేపుతూ.. ఎన్నికలవైపు శరవేగంగా దూసుకుపోతోంది.
సమస్యల ఊబి...
భాజపా ఎంట్రీతో టీఎంసీలో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ.. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటం ప్రతికూలంగా మారింది. వీరిలో చాలా మంది భాజపాలో చేరారు. ఇప్పటివరకు దాదాపు 24మంది ఎమ్మెల్యేలు, 1 సిట్టింగ్ ఎంపీ.. టీఎంసీని వదిలి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఎన్నికల వేళ నేతలు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లడం సహజం. కానీ ఈసారీ తృణమూల్‌ను వీడిన వారిలో ఉన్న ఓ పేరు.. పార్టీలోని అందరినీ కలవరపెడుతోంది. ఆయనే సువేందు అధికారి. మమతకు నమ్మిన బంటుగా ఇన్నేళ్లు టీఎంసీలో ఉన్న ఆయన.. ఎన్నికల ముందు భాజపాలో చేరారు. మమతకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారాలు సాగిస్తున్నారు. ఆమె ఓటమి తథ్యమని ధీమాగా ఉన్నారు.
ఇదీ చూడండి:-'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఇలా కమలదళం అగ్రనేతలందరూ బంగాల్పై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో తిరిక లేని పర్యటనలతో ప్రజల మద్దతు కూడగడుతున్నారు.
బంగాల్లోని ఓ ప్రాంతంలో షా సుబ్రతా విశ్వాస్ నివాసంలో షా భోజం అయితే టీఎంసీకి.. భాజపా ఒక్కటే సమస్యగా కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో అవినీతి మితిమీరిపోయిందన్న ఆరోపణలనూ పార్టీ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా.. అంపన్ తుపాన్ సమయంలో పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య కూడా దీదీని వెంటాడుతోంది.
ఇదీ చూడండి:-పోటీకి దూరంగా 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు - కారణమేంటి?
ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం.. ఐఎస్ఎఫ్(ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్). టీఎంసీకి ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండేది. ఫిర్జాదా అబ్బాస్ సిద్దిఖీ నేతృత్వంలోని ఐఎస్ఎఫ్.. అధికార పార్టీ సభ్యులకు మరో తలనొప్పిగా మారింది. ఐఎస్ఎఫ్ ఎన్నికల్లో గెలవలేకపోయినా.. టీఎంసీకి చెందిన ముస్లిం ఓటు బ్యాంకును చీల్చుతుందని.. అది భాజపాకు ఉపయోగపడే విషయం అని తృణమూల్ నేతలు భావిస్తున్నారు. ఈ సమయంలో.. కాంగ్రెస్-వామపక్షాలు శక్తికి మించి రాణించి.. భాజపాకు చిక్కులు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నారు.
సిద్ధాంత లేమి కూడా టీఎంసీకి మరో ప్రతికూల అంశంగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. టీఎంసీ ఇప్పటివరకు.. 'వామపక్షాలను ఓడించడం' ఒక్కటే సిద్ధాంతగా పెట్టుకుందని.. ఇప్పుడు అసలు అవి తెరపైన లేకపోయే సరికి.. పార్టీ శ్రేణులు కలిసిగట్టుగా ఉండి పోరాడేందుకు కావాల్సిన సిద్ధాంతం కనుమరుగైందని అభిప్రాయపడుతున్నారు.
వ్యూహాలు ఫలించేనా?
ఇంతటి ప్రతికూలతల్లో.. టీఎంసీకి ఉన్న అతిపెద్ద ధైర్యం 'మమతా బెనర్జీ.' మమత అండతో ఎన్నికల్లో గెలిచి మరో ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో కొనసాగాలని నేతలు భావిస్తున్నారు.
ఒడుదొడుకుల వేళ.. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొంటున్నారు మమత. ర్యాలీలు, సభలు నిర్వహించి.. ప్రచారాల వేడిని పెంచుతున్నారు. ఓవైపు పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు చేస్తూనే.. మరోవైపు తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం... 'మమత- సువేందు' పోరు. పార్టీని వీడిన సువేందుపై ప్రత్యక్ష పోరుకు సిద్ధపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సొంత నియోజకవర్గం భవానీపుర్ను విడిచి.. సువేందు కంచుకోట అయిన 'నందిగ్రామ్' నుంచి బరిలో దిగి మరోమారు తన ధైర్యాన్ని చాటుకున్నారు. ఈ సమరంలో ఎవరు గెలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి:-బంగాల్ బరి: అలజడుల నందిగ్రామ్‌లో గెలుపెవరిది?
మమతకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల నుంచి మద్దతు లభించడం మరో సానుకూల అంశం. ఎన్సీపీ, శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు దీదీకి అండగా నిలిచాయి. వీటిల్లో కొన్ని.. బంగాల్ ఎన్నికల నుంచి తప్పుకుని మమతకు మద్దతు ప్రకటించాయి.
టీఎంసీ మద్దతుదారుల కోలాహలం భాజపాను ఎదుర్కొనేందుకు.. టీఎంసీ పలు ప్రత్యేక ప్రణాళికలు రచించింది. ఇందులో మొదటిది.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీ కోసం నియమించుకోవడం. ఆయన నేతృత్వంలో ముందుకు సాగుతోంది తృణమూల్.
కమలదళంపై టీఎంసీ ప్రయోగించిన మరో అస్త్రం... 'ఇన్సైడర్- ఔట్‌సైడర్'. భాజపా బయటి నుంచి వచ్చిన పార్టీ అని.. సొంత గడ్డపై పుట్టుకొచ్చిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అని జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు నేతలు. 'టీఎంసీ.. బంగాల్ ఆత్మగౌరవం' అంటూ నినాదాలు చేస్తున్నారు. వీటికి ప్రజల్లో సానుకూల స్పందన ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి:-'త్వరలోనే దేశానికి 'మోదీ' పేరు!'
నారీశక్తి వంటి అంశాలపైనా దృష్టి సారించింది మమత పార్టీ. అటు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అధికార పక్షానికి కలిసొచ్చే అంశం.
అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు.. నేతల సీట్లలో మార్పులు చేసింది టీఎంసీ. దాదాపు 160మందిని తమ సొంత నియోజకవర్గాల నుంచి మార్చింది.
'చావో-రేవో...'
మొత్తానికి.. 'చావో-రేవో' పరిస్థితుల మధ్య మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. ఎన్నికలకు వెళుతోంది. గెలిస్తే.. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా దీదీ నిలిచిపోతారు. ఓడితే.. పార్టీ విచ్ఛిన్నమై, ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో మే 2నే తేలుతుంది.
ఇదీ చూడండి:-బంగాల్ దంగల్: హైప్రొఫైల్ నేతలతో ప్రచార హోరు