తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చంటూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడారు.

Modi behind ED CBI raids in West Bengal
Modi behind ED CBI raids in West Bengal

By

Published : Sep 19, 2022, 8:33 PM IST

Updated : Sep 19, 2022, 8:59 PM IST

సమయం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే బంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దూకుడు వ్యవహారానికి కొందరు భాజపా నేతలే కారణమని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే భాజపా నేతలు సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు.

"ఇదంతా(రాష్ట్రంలో సీబీఐ దాడులపై) మోదీ చేశారని అనుకోవడం లేదు. భాజపా నేతలే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన అజెండాను, పార్టీ ప్రయోజనాలను వేరుగా చూడాలి. దీనిపై మోదీ చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోంది. ఈ తీర్మానం ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకం కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల పక్షపాత పనితీరుకు మాత్రమే వ్యతిరేకం" అని దీదీ అన్నారు.

కాగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం 189-69 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. విపక్ష భాజపా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. అసెంబ్లీ నిబంధనలకు ఈ తీర్మానం వ్యతిరేకమని విపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.

మాన్ సర్కారు విశ్వాస పరీక్ష
మరోవైపు, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. ఈనెల 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సోమవారం వెల్లడించారు.

పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని తమ ఎమ్మెల్యేలను భాజపా సంప్రదించినట్లు ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆపరేషన్‌ కమలంలో భాగంగా ఆప్‌నకు చెందిన 7 నుంచి 10 ఎమ్మెల్యేలను భాజపా సంప్రదించిందని.. వారికి డబ్బు, మంత్రి పదవులు ఆశచూపిందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్‌పల్ సింగ్ చీమా ఆరోపించారు. ఈనెల 22న నిర్వహించే విశ్వాస పరీక్షలో నెగ్గి... ప్రభుత్వ బలాన్ని చూపుతామని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.

Last Updated : Sep 19, 2022, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details