బంగాల్లోని రైతులు, గిరిజనుల సంక్షేమానికి మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మా, మాటి, మనుష్(అమ్మ, నేల, ప్రజలు) అన్న నినాదంతో గెలిచినవారే ఇప్పుడు నియంతృత్వం, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగితేలుతున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ మెదినీపుర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి హాజరైన నడ్డా.. భాజపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న అన్యాయం ఎక్కువ కాలం సాగదని.. వచ్చే ఎన్నికల్లో మమత ప్రభుత్వం దిగిపోయి, కమలం వికసించక తప్పదని జోస్యం చెప్పారు నడ్డా. ఆయుష్మాన్ భారత్ పథక ప్రయోజనాలను, పీఎం-కిసాన్ ద్వారా అందే సాయాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయారని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ప్రజలకు అందేలా చూస్తామని చెప్పారు.
"ఓవైపు బంగాల్ అభివృద్ధిని కాంక్షించే మోదీ ఉంటే, అన్ని అభివృద్ధి పనులను అడ్డుకొనే మమతా బెనర్జీ మరోవైపు ఉన్నారు. రాష్ట్రానికి మోదీ సర్కార్ అనేక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ.4,700 కోట్ల విలువైన సహజ వాయు ప్రాజెక్టు సహా, రహదారులను మోదీ ఇటీవలే జాతికి అంకితమిచ్చారు. బంగాల్లో రహదారుల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ. 25 వేల కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. బంగాల్లో అన్ని వర్గాల అభివృద్ధి జరిగేలా చూస్తాం."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
ఈ కార్యక్రమంలో భాజపా బంగాల్ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ దిలీప్ ఘోష్, మరో పార్టీ ఎంపీ సుకాంత మజుందార్ పాల్గొన్నారు.