బంగాల్ ముఖ్యంత్రి(West Bengal Cm), టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంతిల్లు లేదు. తనకంటూ సొంత వాహనం లేదు. ఈ విషయాన్ని భవానీపుర్ ఉపఎన్నికల(bhabanipur by election) కోసం శుక్రవారం నామినేషన్వేసినప్పుడు సమర్పించిన ప్రమాణపత్రాల్లో పేర్కొన్నారు మమత. అయితే.. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మమత ఆదాయం(Mamata Banerjee Income) పెరిగినట్లు తెలుస్తోంది. మే నెలలో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్రిగామ్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత.. మమత ఆదాయం రూ.5లక్షల మేర పెరిగింది.
ఆదాయం ఎంతంటే..?
- 2019-20లో మమత ఆదాయం రూ.10,34,370గా ఉంది. 2020-21లో అది రూ.16,47,845కు పెరిగింది.
- 2016 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రాల్లో... మమత ఆదాయం రూ.8,18,300గా ఉంది. అయితే.. 2018-2019లో ఆమె ఆదాయం గణనీయంగా రూ.20,71,010కి పెరగడం గమనార్హం.
శుక్రవారం సమర్పించిన ప్రమాణ పత్రాల ప్రకారం.. మమత బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ రూ.13,11,512గా ఉంది. నందిగ్రామ్ ఎన్నికల సమయంలో ఈ విలువ 13,53,000గా ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మమత బ్యాంక్ బ్యాలెన్స్ రూ.27,61,000గా ఉండటం గమనార్హం. ప్రస్తుతం తన వద్ద రూ.69,255 నగదు ఉన్నట్లుగా మమత.. ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.