తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం బూటకం' - మోదీపై మమత విమర్శలు

పలు రాష్ట్రాల్లో తగినన్ని కరోనా టీకా డోసులు అందుబాటులో లేని సమయంలో ప్రధాని మోదీ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికే విదేశాలకు టీకా ఎగుమతి చేశారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల దేశం.. టీకా కొరత సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్​ విధానం వట్టి బూటకమంటూ మోదీకి ఆమె లేఖ రాశారు.

mamta benarjee
'టీకా కొరత వేళలో.. బహిరంగ మార్కెట్​లో అమ్మకాలా?'

By

Published : Apr 20, 2021, 7:07 PM IST

Updated : Apr 20, 2021, 7:20 PM IST

భారత్​లో ఉన్న టీకాలను విదేశాలకు టీకా ఎగుమతి చేసి.. వ్యాక్సిన్​ కొరత ఏర్పడిన సమయంలో.. బహిరంగ మార్కెట్​లో అమ్మకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతించారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. భగవన్​గోలాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్​, బంగాల్​ వంటి రాష్ట్రాలు తగినన్ని టీకా డోసులు లేక సతమతమవుతోంటే.. ప్రధాని తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు విదేశాలకు టీకా ఎగుమతి చేశారని దుయ్యబట్టారు.

"బహిరంగ మార్కెట్​లో టీకాలు అందుబాటులో ఉంటాయని ప్రధాని నిన్న ప్రకటించారు. అసలు ఎక్కడుందీ బహిరంగ మార్కెట్​? ఎక్కడున్నాయి టీకాలు? మీరు ఎప్పుడో విదేశాలకు ఎగుమతి చేశారు కదా."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు నిర్ణయాల వల్ల టీకా కొరత సమస్యను దేశం ఎదుర్కొంటోందని మమత వ్యాఖ్యానించారు. కొవిడ్​ విలయం కొనసాగుతున్న తరుణంలో.. బంగాల్​ ఎన్నికలపై మాత్రమే కేంద్రం దృష్టిసారించిందని ఆరోపించారు. వారి ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాపించిందని అన్నారు.

'వట్టి బూటకం..'

అంతకుముందు.. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్​ విధానం వట్టి బూటకం అని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయవచ్చని కేంద్రం చేసిన ప్రకటన వల్ల టీకాల నాణ్యత, సమర్థత, స్థిరమైన సరఫరా అంశాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. మార్కెట్​లో టీకాల ధరలు కూడా పెరుగుతాయని చెప్పారు.

"18 ఏళ్లు దాటిన వారికి టీకా వేయవచ్చని చాలా ఆలస్యమైన ప్రకటన ఏప్రిల్​ 19న కేంద్రం చేసింది. అది బూటకంలా కనిపిస్తోంది. సంక్షోభ సమయంలో బాధ్యతలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వ చర్యలకు ఇది నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మార్కెట్​ నియంత్రించిన ధరల ఆధారంగా వ్యాక్సిన్ల ధరలు చేరుతాయి. అది సామాన్య ప్రజలకు ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల టీకా సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారుతుందని మమత తెలిపారు. తగినన్ని టీకాలు.. మార్కెట్​లో అందుబాటులో లేవని.. ముందు వాటిని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

దేశంపై మరోసారి కరోనా పంజా విసురుతున్న వేళ టీకా పంపిణీ‌ మూడో విడత ప్రణాళికలను కేంద్రం సరళతరం చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. టీకా ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసే టీకా డోసుల్లో 50శాతం కేంద్రానికి, మిగిలిన 50శాతం డోసులను నేరుగా రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్​లో విక్రయించుకునేందుకు అనుమతించింది.

ఇదీ చూడండి:కోర్టులో ఏడుగురు జడ్జిలు సహా 44 మందికి కరోనా

Last Updated : Apr 20, 2021, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details