తమిళనాడుకు చెందిన ఓ యువ జంట పెళ్లి శుభలేఖ తాజాగా నెట్టింట సంచలనంగా మారింది. వధూవరుల పేర్లు పి.మమతా బెనర్జీ, ఏఎం సోషలిజం కావడమే అందుకు కారణం. అయితే ఈ శుభలేఖ నిజమైందేనా లేదా ఎవరైనా అలా సృష్టించారా..? అనే అంశంపై నెటిజన్లలో చర్చ మొదలైంది. అయితే ఆ సందేహానికి తెర దించుతూ.. వరుడి తండ్రి ఆ శుభలేఖ వాస్తవమేనని తేల్చారు.
అభిమానంతో..
సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లెనిన్ మోహన్.. తన కుమారులు సహా వధువు పేర్ల వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. కమ్యూనిజంపై అభిమానంతోనే కుమారులకు అలాంటి పేర్లు పెట్టినట్టు ఆయన తెలిపారు. తన స్వగ్రామం కత్తూరులో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని అభిమానిస్తారని.. అందుకే అక్కడ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు సాధారణంగా వినిపిస్తాయని వివరించారు.
ముఖ్యమంత్రి స్ఫూర్తితో..
వధువు కూడా తమ బంధువేనని, ఆమె తాతయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని లెనిన్ మోహన్ చెప్పారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొంది అమె పేరునే మనవరాలికి పెట్టినట్టు పేర్కొన్నారు. తమ భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడానికి తన మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టినట్టు తెలిపారు.