భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై భాజపా ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ భాజపాయేతర పార్టీల నేతలకు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. భాజపా తీరుతో ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయో అందులో వివరించారు.
''భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ఆధారిత సమాఖ్యవాదంపై కేంద్రంలో భాజపా ప్రభుత్వం జరిపిన వరుస దాడులపై నాకున్న తీవ్రమైన ఆందోళనను తెలియజేసేందుకే భాజాపాయేతర పార్టీల నాయకులైన మీకు ఈ లేఖ రాస్తున్నాను.''
-మమతా బెనర్జీ లేఖ.
జాతీయ రాజధాని ప్రాంతంగా దిల్లీ (సవరణ) బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం 'అత్యంత ఘోరమైన' చర్య అని మమత తన లేఖలో వివరించారు. ఈ చట్టంతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన దిల్లీ ప్రభుత్వ అధికారాలను కొల్లగొట్టి.. లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి అప్పగించారని ఆరోపించారు.
సోనియా గాంధీ, శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కే.ఎస్.రెడ్డి, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, దీపాంకర్ భట్టాకు వ్యక్తిగతంగా మమత లేఖ రాశారు.
ఇవీ చదవండి:మమతXసువేందు: 'మెగా వార్' విజేత ఎవరు?
నందిగ్రామ్ రణం: నాడు వద్దన్నదే.. నేడు ముద్దు!