Opposition parties unity : 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా భాజపాను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌కు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోడయ్యారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపాను గద్దెదించుతాయని దీదీ అన్నారు. ఇందుకోసం పొరుగురాష్ట్రాలైన బిహార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా అహంకారం, ప్రజల ఆగ్రహం రెండూ భాజపాను తుదముట్టిస్తాయని అన్నారు.
''నేను, నీతీశ్ కుమార్, హేమంత్ సోరెన్.. ఇంకా చాలా మంది 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతాం. భాజపాను ఓడించాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి. మనమంతా ఓ వైపు.. భాజపా మరోవైపు ఉంటుంది. 300 సీట్లు ఉన్నాయన్న అహంకారమే భాజపాకు శత్రువుగా మారుతుంది. 2024లో అసలైన ఆట(ఖేలా హోబే) ఆరంభం అవుతుంది.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
'ఖేలా హోబె' అనేది గతేడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించిన నినాదం. దీని అర్థం అసలైన ఆట ఇప్పుడు మొదలైంది అని. ప్రచార సమయంలోనూ మమతా బెనర్జీ ఫుట్‌బాల్‌తో వచ్చి ఖేలా హోబె అంటూ నినదించారు. ఆ ఎన్నికల్లో భాజపాను ఓడించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది తృణమూల్ కాంగ్రెస్.
మరోవైపు భాజపాను ఓడించాలన్న సంకల్పంతో.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను బుధవారం మొదలుపెట్టారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.
నీతీశ్ ముమ్మర ప్రయత్నాలు..మరోవైపు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కూడా.. భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటీవల దిల్లీ పర్యటన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిశారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని.. 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత అని ఆయన వ్యాఖ్యానించారు.
భాజపా విమర్శలు..రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ విపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలపై.. భాజపా విమర్శలు గుప్పించింది. అవన్నీ తమ తమ పార్టీల బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాలని, వాటివల్ల భాజపాకు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
ప్రతిపక్ష నేతలు మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, కేసీఆర్ లేదా కాంగ్రెస్‌కు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు సత్తా లేదన్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. దేశాన్ని ఐక్యం చేసే అన్ని అంశాలను విచ్ఛిన్నం చేసిందని త్రివేది ఆరోపించారు. బిహార్‌లో భాజపా, ఆర్జేడీ ప్రధాన పార్టీలని, మూడో పార్టీగా ఉన్న జేడీయూ.. ప్రధాన ఫ్రంట్ తయారు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని త్రివేది ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి :'దేశంలో ఎన్నో సవాళ్లు.. రాహుల్ అధ్యక్షుడైతేనే సాధ్యం'
అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అంటున్న నీతీశ్.. విపక్షాలన్ని ఏకతాటిపైకి..