Mamata Banerjee On Central Agencies BJP :ప్రస్తుతం విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్న కేంద్ర ఏజెన్సీలు.. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ వెంట పడతాయని బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో మూడు నెలలు మాత్రమే కొనసాగుతుందని ఆమె అన్నారు. గురువారం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మమత బెనర్జీ ప్రసంగిచారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు (సీబీఐ, ఈడీ, ఐటీ..) వివిధ కేసుల్లో తమ పార్టీ నేతలను అరెస్టు చేశాయని ఆమె తెలిపారు. ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని BJP చూస్తోందని.. అలా అయితే అది సాధారణ ఎన్నికలకు ముందు ఆమెకే ఉపయోగపడుతుందని దీదీ అన్నారు.
"కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్‌లను తొలగించాలని కోరుకుంటోంది. దానిని నేను వ్యతిరేకిస్తున్నాను. మైనారిటీల రిజర్వేషన్లు కల్పించడాన్నీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ఓబీసీ కోటా ద్వారా వారికి రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో కాషాయీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి క్రికెట్ జట్టు వరకు మొత్తం కాషాయమయం చేస్తున్నారు" అని మమత బెనర్జీ ఆరోపించారు.
అన్నీ త్యాగం చేసిన యోగులు కాషాయం ధరిస్తారని.. కానీ ఆ రంగును అడ్డుపెట్టుకున్న 'భోగులు' అని బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని మమత తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో కాకుండా కోల్‌కతా లేదా ముంబయిలో జరిగితే భారత్ గెలిచి ఉండేదని TMC చీఫ్ పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో 'పాపులు' హాజరైన మ్యాచ్ మినహా.. మిగతా అన్ని మ్యాచ్‌లు టీమ్ఇండియా గెలుపొందిందని ఆమె తెలిపారు.