తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ-పవార్ భేటీ కాకపోవడానికి కారణం అదేనా? - mamata pawar delhi

దిల్లీ పర్యటనలో భాగంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​తో సమావేశం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరువర్గాలవైపు నుంచి ఎటువంటి చొరవ లేకపోవడంతో వారి మధ్య సమావేశం జరగలేదని సన్నిహితులు అంటున్నారు. అయితే రాజకీయ నిపుణులు మాత్రం వేరే కారణాలు చెబుతున్నారు.

pawar mamata meet
పవార్ మమతా బెనర్జీ సమావేశం

By

Published : Jul 31, 2021, 7:00 AM IST

విపక్షాలను ఏకం చేసి, 2024లో భాజపాకు గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె దిల్లీలో పలు పార్టీలకు చెందిన నేతలతో మంతనాలు సాగించారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. జులై 26న దేశరాజధానికి చేరుకున్న ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే పార్టీ నేత కనిమొళితో సమావేశమయ్యారు.

అయితే ఇదే సమయంలో ఆమె ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌తో కూడా భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేమీ లేకుండా దీదీ శుక్రవారం సొంత రాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు. మరోపక్క పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన పవార్ ఈ రోజే మహారాష్ట్రకు చేరుకున్నారు. ఇరువర్గాలవైపు నుంచి ఎటువంటి చొరవ లేకపోవడంతో వారి మధ్య సమావేశం జరగలేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం తృణమూల్ నేత యశ్వంత్ సిన్హాతో పవార్ సమావేశమయ్యారని, దీనిపై అనవసర ఊహాగానాలు అవసరం లేదని మరికొందరు నేతలు వ్యాఖ్యానించారు.

ఏదిఏమైనప్పటికీ.. దీదీ, పవార్ మధ్య సమావేశం జరకపోవడానికి రాజకీయ నిపుణులు రెండు కారణాలు చెబుతున్నారు. ఈ ఇద్దరూ ప్రభావంతమైన రాజకీయనేతలు. విపక్షాల కూటమికి నాయకత్వం వహించేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఒకరి నుంచి వచ్చే స్పందన కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇటీవల ప్రధాని, పవార్ మధ్య భేటీ కూడా చర్చనీయాంశమైంది. ఈ సమావేశం కూడా దీదీ-పవార్ కలుసుకోకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

ప్రతి రెండు నెలలకు దిల్లీకి వస్తా: మమత

తన దిల్లీ పర్యటన విజయవంతం అయినట్లు, ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇక్కడ పర్యటించనున్నట్లు మమత వెల్లడించారు. అలాగే ఆమె పవార్‌తో మాట్లాడినట్లు కూడా తెలిపారు. ‘నేను శరద్‌ పవార్‌తో మాట్లాడాను. నా దిల్లీ పర్యటన విజయవంతమైంది. మేం రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశాం. దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి. ‘ప్రజాస్వామ్య రక్షణ.. దేశ రక్షణ’ అనే నినాదంతో మేం ముందుకెళ్తున్నాం. ఇక నుంచి ప్రతి రెండు నెలలకొకసారి దిల్లీలో పర్యటిస్తాను. ప్రస్తుత పర్యటన సంతృప్తికరంగా ఉంది’ అని వెల్లడించారు. అలాగే 2024 ఎన్నికల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని మమత.. దేశ రక్షణే ప్రతిఒక్కరి నినాదం కావాలని బదులిచ్చారు.

ఇదీ చదవండి:'ప్రతి రెండు నెలలకు ఒకసారి దిల్లీ వస్తా'

ABOUT THE AUTHOR

...view details