Mamata Banerjee: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన కేంద్రం.. అదే మహాత్ముడిపై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని తిరస్కరించి అన్యాయం చేసిందని మండిపడ్డారు. శకటాన్ని తిరస్కరించడానికి గల కారణాలనూ వెల్లడించలేదని తప్పుబట్టారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ఆదివారం ఆమె మాట్లాడారు. నేతాజీ శౌర్యాన్ని, పరాక్రమానికి అద్దంపట్టేవిధంగా సృజనాత్మకంగా తీర్చదిద్దిన శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా నేతాజీ అదృశ్యం విషయంలో మిస్టరీ గురించి కేంద్రాన్ని మమత ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయన మిస్టరీని ఛేదిస్తామని చెప్పిన భాజపా.. పూర్తిగా ఆ ప్రమాణాన్ని విస్మరించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఈ విషయంలో ముందడుగు పడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేతాజీకి సంబంధించి డాక్యుమెంట్లన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజిటలైజ్ చేశామని చెప్పారు. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్నీ మమత తప్పుబట్టారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పివేసి.. నేతాజీ విగ్రహాన్ని నెలకొల్పి ఆ తప్పును కప్పిపుచ్చుకోలేరని విమర్శించారు. విగ్రహాలు, స్మారకాలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.