బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీగాయాలతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనుకాగా.. మమత నడుముకు, కాళ్లకు గాయాలయ్యాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముప్పు తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు మమతకు చికిత్స చేశారు.
ప్రచారం ముగించుకుని వస్తూ..
బంగాల్లో జులై 8న జరగనున్న పంచాయితీ ఎన్నికల కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు మమతా బెనర్జీ. రెండు రోజులుగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రచారం ముగించుకుని కోల్‌కతాకు తిరిగి వద్దామని బయలుదేరారు. బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి రాజధానికి విమానంలో వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం జల్పాయ్గుడి నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే.. మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠ్పుర్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షంలో చిక్కుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ మొత్తం ఊగిపోయింది. అందులో ఉన్న సీఎం గాయపడ్డారు. ఆమెతోపాటు ఉన్న అధికారులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. క్లిష్ట సమయంలో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించారు. సిలిగుడి సమీపంలోని సివోక్ ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించారు. ముఖ్యమంత్రికి పెను ప్రమాదం తప్పినందున అధికారులు, టీఎంసీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.