నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు అపూర్వమైన 'హ్యాట్రిక్' విజయం అందించిన దీదీ.. తొలిసారి నందిగ్రామ్ నుంచి బరిలో దిగి ఒకప్పటి తన కుడి భుజంలా ఉన్న నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు.
మే 3న జరిగిన ఓట్ల లెక్కింపులో నందిగ్రామ్ ఫలితం క్షణం క్షణం ఉత్కంఠ రేపింది. మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య రౌండ్ రౌండుకూ ఆధిక్యం చేతులు మారడం వల్ల విజయం చివరి వరకూ దోబూచులాడింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ అనంతరం చివరకు దాదాపు 1700 ఓట్ల తేడాతో సువేందు అధికారి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.