కేంద్ర ఎన్నికల సంఘం బంగాల్ ప్రభుత్వ అధికారులను పెద్దఎత్తున బదిలీ చేయడంపై తృణమూల్ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ విధుల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఈసీ.. భాజపా కమిషన్‌గా మారిందని దాంతన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దుయ్యబట్టారు.
ఎన్నికల సంఘంపై ఎంతో గౌరవం ఉందని మమత తెలిపారు. అయితే ఈసీ మాత్రం తన ప్రభుత్వంపై సవతి ప్రేమను చూపిస్తోందని ధ్వజమెత్తారు. తనకు షోకాజ్ నోటీసులు పంపడంపై స్పందించిన మమత.. ఇలాంటివి 10 లేఖలు పంపినా భయపడనని తేల్చిచెప్పారు. భాజపా ఇచ్చే ప్రతి సూచనకు ఈసీ తలొగ్గి పని చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు మమత.
అధికారులందరినీ బదిలీ చేయండి. అయితే ఇది తృణమూల్ కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేదు. ఎందుకంటే ప్రజలంతా మాతోనే ఉన్నారు.
-మమతా బెనర్జీ
భాజపాకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అధికారులను అడ్డంపెట్టుకుని మ్యాచ్ గెలవాలని చూస్తోందని మమత విమర్శించారు. అయితే ఓటు వేసేది అధికారులు కాదని.. ప్రజలేననే విషయం భాజపా గుర్తుంచుకోవాలన్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి వచ్చిన నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలను కోరారు.
మొదటి దశకు ముందు..
బంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఐఏఎస్ సహా.. నలుగురు ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సదరు అధికారులను తొలగించినట్లు ఈసీ తెలిపింది. మరోవైపు.. మార్చి 27న ఓటింగ్ జరగనున్న జార్గ్రాం జిల్లాలో 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి:'డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్న భాజపా'