తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఖర్గే ఘన విజయం.. ఆ సవాళ్లను అధిగమిస్తారా?

Mallikarjun Kharge Congress President: సోనియాగాంధీ స్థానంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనేది తేలిపోయింది. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే.. ఘన విజయం సాధించారు.

mallikharjuna kharge
mallikharjuna kharge

By

Published : Oct 19, 2022, 1:46 PM IST

Updated : Oct 19, 2022, 2:34 PM IST

Mallikarjun Kharge Congress President: 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ​ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా అడుగుపెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి అయిన తిరువనంతపురం కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు థరూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓ కీలక బాధ్యతని.. దాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో ఖర్గే సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు థరూర్.

  • మొత్తం పోలైన ఓట్లు : 9385
  • ఖర్గేకు వచ్చిన ఓట్లు: 7897
  • థరూర్​కు వచ్చిన ఓట్లు: 1072
  • చెల్లని ఓట్లు: 416

అధ్యక్ష ఎన్నికకు అక్టోబరు 17న పోలింగ్‌ చేపట్టగా.. దేశవ్యాప్తంగా దాదాపు 96శాతం మంది పార్టీ ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను దిల్లీకి తీసుకొచ్చి బుధవారం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆధ్వర్యం లెక్కింపు చేపట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షుడికి సవాళ్ల స్వాగతం
2014 తర్వాత క్రమక్రమంగా బలహీనపడిన కాంగ్రెస్​ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా రాణించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో లోక్​సభలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ తదుపరి అధ్యక్షుడికి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటిని ఖర్గే ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

  • దేశవ్యాప్తంగా పార్టీకి పునరుజ్జీవం పోయాలి
  • బలమైన ప్రత్యర్థి భాజపాను ఎదుర్కోవాలి
  • 2024 లోక్​సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
  • జీ23 నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి
  • త్వరలో జరగబోయే గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవాలి
  • ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​ను కాపాడుకోవాలి
  • వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీని నడిపించాలి

గాంధీలకు విశ్వాసపాత్రుడు
దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పని చేస్తున్న ఖర్గేకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గాంధీ కుటుంబమే ఖర్గేను బరిలోకి దించుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణాది నుంచి ఆరో నేత
ఒక వేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే స్వాతంత్ర్యం సాధించిన తర్వాత దక్షిణభారతం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆరోనేతగా మల్లిఖార్జున ఖర్గే రికార్డు సృష్టిస్తారు. ఇప్పటి వరకు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్‌, యస్‌.నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 1969లో కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే.. 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వరుసగా 8 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1976లో తొలిసారిగా దేవరాజ్‌ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన్ని మంత్రిగా నియమించేవారు. 1996-99, 2008-09 మధ్య కాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. 2005-08 మధ్య కర్ణాటక ప్రదేశ్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వశాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ అనుభవంతో పార్టీని ఖర్గే ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

2014లో కీలక మలుపు
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. లోక్‌సభలో పార్టీ బలం కేవలం 44 మంది మాత్రమే. ఆ ఎన్నికల్లో కలబురిగి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఖర్గే వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ను నియమించింది. దీంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న ఖర్గే.. తన వాక్చాతుర్యంతో అధికార భాజపాను కట్టడి చేసేందుకు యత్నించేవారు. "మేము 44 మంది మాత్రమే అయినా.. మహాభారతంలో 100 మంది కౌరవులు పాండవులను నిలువరించలేకపోయారు" అంటూ భాజపా ఎంపీలకు చురకలంటించేవారు. భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారు. ఐదేళ్ల పాటు లోక్‌సభలో ప్రతిపక్షనేతగా పలు ప్రజాసమస్యలను సభ ఎదుట ఉంచారు.

2019లో తొలి ఓటమి
ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఖర్గేను 2019లో పరాజయం పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. దీంతో ఆయన పనితీరును, సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఫిబ్రవరి 2021లో పార్టీ తరఫున ఆయన్ను రాజ్యసభకు పంపించింది. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి:ఖర్గే X థరూర్ X త్రిపాఠీ​.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలుపెవరిదో?

అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్​.. రేసులో ఖర్గే.. నామినేషన్ వేసిన శశి థరూర్​

Last Updated : Oct 19, 2022, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details