కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించారు ఖర్గే. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు అందజేశారు పార్టీ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ మధుసూధన్ మిస్త్రీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. ఇది తనకు భావోద్వేగంతో కూడిన క్షణమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. దేశంలో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు. 'ప్రస్తుతం ఉన్న విద్వేషాన్ని, అబద్ధపు సంకెళ్లను కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది. 50ఏళ్ల లోపు నేతలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్న ఉదయ్‌పుర్ డిక్లరేషన్‌లోని ప్రతిపాదనను అమలు చేస్తాం' అని ఖర్గే పేర్కొన్నారు.
'ఉపశమనంగా ఉంది'
కాంగ్రెస్‌కు అనుభవజ్ఞుడైన నాయకుడు అధ్యక్షుడిగా రావడం తనకు సంతృప్తినిచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్ష పదవి అందుకునే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నా సామర్థ్యం మేరకు కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. ఈ బాధ్యతల నుంచి వైదొలగుతున్నందున కాస్త ఉపశమనంగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. పూర్తి ఐకమత్యంతో మేం ఈ సవాళ్లను అధిగమిస్తాం' అని సోనియా అన్నారు.
అంతకుముందు ఖర్గే మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఉదయమే రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన.. బాపూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం శాంతివన్, శక్తిస్థల్లను సందర్శించిన ఖర్గే.. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలకు నివాళులు అర్పించారు.