Malkajgiri 14 Years Boy Kidnap Case Updates : మల్కాజిగిరిలో బాలుడి కిడ్నాప్ కేసులో నిందితులు పన్నిన వ్యూహం పోలీసులను కంగు తినిపించింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు, రూ.2 కోట్లు తమ చేతికి అందాక బాలుడి మదిలోంచి జ్ఞాపకాలు చెరిపేసి.. పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నట్లు తెలిసింది. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొని ఛేదించడంతో నిందితుల వ్యూహం బెడిసికొట్టింది.
14 Years Boy Kidnapping Case in Malkajgiri : హైదరాబాద్ మౌలాలీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్ 14 ఏళ్ల కుమారుడి అపహరణ వెనక నిందితులు పన్నిన పథకం క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. బాలుడు హర్షవర్ధన్‌ను ఈ నెల 15న క్రికెట్ బంతి ఇప్పిస్తామంటూ నిందితులు శివ, రవి మరికొంత మందితో కలిసి అపహరించారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు తల్లిదండ్రులను రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు సమన్వయంతో నిందితులను పట్టుకుని బాలుడిని సురక్షితంగా కాపాడారు.
నిందితులు కారులో బాలుడిని 15, 16 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తిప్పారు. మిగతా కుట్రను కడప నుంచి అమలు చేసేందుకు 16వ తేదీ ఉదయం ప్రధాన నిందితుడు శివ కడపకు వెళ్లాడు. కడపకు చేరుకున్న శివ బాలుడి తండ్రి రూ.2 కోట్లు ఇవ్వగానే అందరినీ కడపకు రమ్మని సూచించాడు. అక్కడ తనకు తెలిసిన వారి ద్వారా బాలుడికి మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స ద్వారా అతని గత జ్ఞాపకాలు చెరిపేయాలని భావించాడు. బాలుడికి తాము ముందే పరిచయం ఉండటంతో తల్లిదండ్రులకు అప్పగించాక తమ గురించి చెబుతాడని ఈ ఆలోచన చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది.