Maldives India Issue : 36ద్వీపాల సమాహారమైన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవుల్లో గుబులురేపుతోంది. ఆ దేశ మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోదీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖలపై భారత సెలబ్రిటీలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. అక్కడి అందాలను వివరిస్తూ సోషల్‌మీడియాలో మాల్దీవుల మంత్రులకు బదులిస్తున్నారు.
మంత్రులపై చర్యలు!
మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ దేశ సర్కార్ దిద్దుబాటు చర్యల కోసం రంగంలోకి దిగింది. ప్రధాని మోదీతోపాటు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని పేర్కొంది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని అది ద్వేషాన్ని పెంపొందించేదిగా ఉండకూడదని హితవు పలికింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
సెలబ్రిటీల మద్దతు
మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యటక గమస్థానం లక్షద్వీప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ బాయకాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. భారత్‌లోని లక్షద్వీప్, సింధుదుర్గ్ లాంటి ద్వీపాలను సందర్శించాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ దీనికి మద్దతు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు భారత్‌తో వివాదం వేళ మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్‌సైట్లు సాంకేతిక లోపం తలెత్తి డౌన్ అయ్యాయి.
మంత్రి వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ అధ్యక్షులు ఫైర్!
మాల్దీవుల మంత్రి అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ సైతం విచారం వ్యక్తం చేశారు. మాల్దీవుల శ్రేయస్సు, భద్రతలో కీలకమైన మిత్రదేశ నాయకుడిని విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వ విధానానికి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని భారత్‌కు స్పష్టత ఇవ్వాలని చెప్పారు.
మరో మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ సోలిహ్ కూడా స్పందించారు. "సోషల్ మీడియాలో మాల్దీవుల మంత్రులు భారతదేశంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. భారత్- మాల్దీవుల స్నేహపూర్వక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అలాంటి వ్యాఖ్యలను ఎప్పుడూ అనుమతించకూడదు" అని ట్వీట్ చేశారు.