Maldives Controversy : భారత ప్రధాని నరేంద్ర మోదీపై అగౌరవ వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. విదేశాంగ మంత్రిని బాధ్యుడిని చేస్తూ ఆయనకు పార్లమెంట్ సమన్లు పంపించాలని ఆ దేశ ఎంపీ మిఖైల్ నసీమ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై జవాబుదారీతనం అవసరమని, ఇందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి సమన్లు జారీ చేసి ఆయన్ను ప్రశ్నించాలని కోరారు. పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పర్యటక పరిశ్రమల సంఘం ఫైర్
మరోవైపు మోదీపై మాల్దీవులమంత్రులు చేసిన వ్యాఖ్యలను అక్కడి పర్యటక పరిశ్రమలు తీవ్రంగా ఖండించాయి. "భారత్ మాకు మంచి పొరుగు మిత్ర దేశం. దేశంలో తలెత్తిన వివిధ విపత్కర పరిస్థితుల్లో భారత్ మొదట స్పందించి అండగా నిలిచింది. ఇందుకు భారత ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలకు మనము ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉండాలి. మాల్దీవుల పర్యటక రంగం అభివృద్ధిలో భారత్ ప్రధానపాత్ర పోషిస్తుంది. కరోనా తర్వాత పర్యటక రంగం పుంజుకోవడంలోనూ భారత్ ఎంతో కృషి చేసింది. భారత్ ఎన్నో ఏళ్లుగా మాల్దీవులకు ప్రధాన మార్కెట్‌గా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగాలి" అని మాల్దీవులు టూరిజం పరిశ్రమల సంఘం తెలిపింది.
విమానాల బుకింగ్‌ను నిలిపేసిన ఈజ్ మైట్రిప్
మరోవైపు మాల్దీవులపై ప్రైవేటు పర్యాటక సంస్థ ఈజ్ మైట్రిప్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్‌ను నిలిపేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిత్తీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.