67 Year Old Man Won 3 Medals :సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు ఓ రిటైర్డ్ సైనికుడు. 67 ఏళ్ల వయసులో యువకుడిలా పరుగెడుతూ.. అనేక పతకాలు సాధిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్. ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న సురేంద్ర.. తాజాగా మలేసియా ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్లో మరో మూడు పతకాలు సాధించారు. 5 నుంచి 50 కిలోమీటర్ల రన్నింగ్ రేసుల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
హమీర్‌పుర్‌కు చెందిన సురేంద్ర సింగ్.. ఇప్పటివరకు ఏడు సార్లు నేషనల్ ఓపెన్ మాస్టర్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 8 బంగారు, మూడు రజత పతకాలు గెలుచుకున్నారు. తాజాగా సెప్టెంబర్ 16,17 తేదీల్లో జరిగిన మలేసియా ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొని.. రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 800, 1500 మీటర్ల రన్నింగ్ రేస్‌లో రజతాలు సాధించగా.. 3000 మీటర్ల పరుగు పందెంలో ఓ కాంస్యాన్ని గెలుచుకున్నారు. థాయిలాండ్‌లో జరిగిన 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండు రజత, ఓ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, గుజరాత్, పటియాలా, మణిపుర్లో జరిగిన అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు సురేంద్ర. 17ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన సురేంద్ర సింగ్... తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, రన్నింగ్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు.
"45 ఏళ్ల వయసులో సరదాగా రన్నింగ్ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత క్రమంగా ఆసక్తి పెరగడం వల్ల జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పటికే అనేక పతకాలు సాధించాను. త్వరలో యూరప్‌లో జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణం గెలుచుకోవడమే నా లక్ష్యం."