తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

hijab controversy: కర్ణాటకలో హిజాబ్​ వివాదంపై ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకకూడదని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అన్నారు. మహిళలు ఏ వస్త్రాలు ధరించాలని నిర్ణయించుకునే అధికారం వారికి ఉంటుందని, వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల.. హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతిగదిలోకి అనుమతించకపోవటం దారుణమన్నారు.

hijab row
హిజాబ్ వివాదంపై ప్రముఖుల ఆందోళన

By

Published : Feb 9, 2022, 12:06 PM IST

Updated : Feb 9, 2022, 1:16 PM IST

Karnataka hijab row: దక్షిణాది రాష్ట్రం కర్ణాటకను హిజాబ్‌ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కాగా.. ఈ వివాదంపై ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

'కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య విషపు గోడగా నిలుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మారుతోంది. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా' అని కమల్‌హాసన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Priyanka gandhi hijab

ప్రియాంక ట్వీట్​..

ఈ వివాదంపై ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏ వస్త్రాలు ధరించాలో మహిళ ఇష్టం అని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. మహిళలను వేధించడం ఆపాలన్నారు.

'బికినీ, ఘూంఘాట్​, హిజాబ్​, జీన్స్​ ఇలా ఏది ధరించాలో నిర్ణయించుకునే అధికారం మహిళలకు ఉంటుంది. రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది' అని ప్రియాంక పేర్కొన్నారు.

Malala yousafzai hijab

మలాల విచారం..

హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకపోవడం బాధాకరమని అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్​జాయ్. కర్ణాటకలో హిజాబ్​ వివాదం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్​ వేదికగా స్పందించారు. హిజాబ్‌లో వస్తోన్న బాలికలను చదువుకోనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.

'చదువా.. హిజాబా.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునేలా కాలేజీలు బలవంతపెడుతున్నాయి. హిజాబ్‌ ధరించిన అమ్మాయిలను చదువుకు తిరస్కరించడం దారుణం. భారత నేతలు దీన్ని ఆపాలి' అని మలాలా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

వివాదం ఏమిటి?

కర్ణాటకలో జనవరి 1 న మొదలైన హిజాబ్‌ వస్త్రధారణ వివాదం నానాటికీ తీవ్ర రూపం దాల్చింది. నిన్న ఉడుపి, బెళగావి, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్ని చోట్ల ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం.. కాలేజీలు, స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగనుంది.

ఇదీ చదవండి:'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'

Last Updated : Feb 9, 2022, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details