Wife Must Obey Husband: 'భర్తకు విధేయంగానే భార్య ఉండాలి..' అనే భావనతో ఎక్కువ మంది భారతీయలు ఏకీభవిస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మేధోమధన సంస్థ తాజా అధ్యయనంలో పేర్కొంది. అదే సమయంలో మహిళలకు పురుషులతో సమాన హక్కులుండటం ముఖ్యమని వారంతా అంగీకరిస్తున్నట్లు వెల్లడించింది. 'ప్యూ రీసెర్చి సెంటర్' జరిపిన ఈ అధ్యయనంపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈమేరకు భారత్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 చివరి నుంచి 2020 ప్రారంభం (కొవిడ్‌కు ముందు) వరకు 29,999 మంది భారతీయ వయోజనులతో (17 భాషల్లో) సర్వే చేపట్టింది.
'అన్ని సందర్భాల్లోనూ భార్య.. భర్తకు విధేయంగానే ఉండాలి' - ప్యూ రీసెర్చ్ సెంటర్
Wife Must Obey Husband: భారతీయుల్లో.. ఎక్కువ మంది భర్తకు విధేయంగానే భార్య ఉండాలనే భావనతో ఏకీభవిస్తున్నారని అమెరికాకు చెందిన 'ప్యూ రీసెర్చి సెంటర్' తన అధ్యయనంలో వెల్లడించింది. అలాగే కొన్ని కుటుంబ బాధ్యతలను పురుషులు, మహిళలు పంచుకోవాలన్న భావన కూడా వ్యక్తమైనట్లు వెల్లడించింది.
"అన్ని సందర్భాల్లోనూ భార్య భర్తకు విధేయంగా ఉండాలన్న భావనతో 87% మంది ఏకీభవించారు. ఎక్కువ మంది మహిళలు కూడా దీన్నే అంగీకరిస్తున్నారు. అలాగే కొద్ది ఉద్యోగాలు మాత్రమే ఉన్నప్పుడు పురుషులకు కొంత ప్రాధాన్యం ఉండాలని 80% మంది అభిప్రాయపడ్డారు" అని నివేదిక వెల్లడించింది. ఇందిరా గాంధీ, మమతా బెనర్జీ, జయలలిత, సుష్మా స్వరాజ్ వంటివారిని ఉటంకిస్తూ.. మహిళలు రాజకీయ నేతలుగానూ రాణించగలరని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు అధ్యయనం తెలిపింది. అలాగే కొన్ని కుటుంబ బాధ్యతలను పురుషులు, మహిళలు పంచుకోవాలన్న భావన కూడా వ్యక్తమైనట్లు వెల్లడించింది. ప్రతి కుటుంబంలో ఒక బాబు, పాప ఉండాలన్న విషయాన్ని ముక్త కంఠంతో చెబుతున్నట్లు పేర్కొంది. తల్లిదండ్రులకు అంత్యక్రియలు నిర్వహించడంలో కుమారులదే బాధ్యత అని 63% మంది సర్వేలో అభిప్రాయపడినట్లు నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి :'వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం.. గత పాలకుల వల్లే'