1725 సెప్టెంబరు 29న జన్మించి.. ఇంగ్లాండ్‌లో అల్లరిచిల్లరగా తిరిగి ఎక్కడా కుదురుకోని.. రాబర్ట్‌క్లైవ్(robert clive achievements) ఈస్టిండియా కంపెనీలో(east india company in india) గుమస్తాగా 1743లో మద్రాసుకు వచ్చాడు. ఆ సమయానికి వివిధ ఈస్టిండియా కంపెనీల (ఫ్రెంచ్, పోర్చుగీసు..) మధ్య వ్యాపార యుద్ధం సాగుతోంది. ఆ క్రమంలో.. ఇంగ్లాండ్ ఈస్టిండియా తరఫున మిలిటరీ శిక్షణ పొందాడు క్లైవ్. ఆర్కాట్ సంస్థానంలో వ్యాపారంపై ఈస్టిండియా విజయం సాధించటంలో చురుకైన పాత్ర పోషించిన క్లైవ్ అందరి దృష్టిలో పడ్డాడు. పెళ్లి చేసుకొని ఇంగ్లాండ్ వెళ్లి పార్లమెంటు సభ్యుడయ్యేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1755లో మద్రాసుకు మళ్లీ పంపించారు. ఈసారి ఈస్టిండియా మద్రాసు కంపెనీ రాయల్ ఆర్మీ అధికారిగా వచ్చాడు.
ఆ సమయానికి మద్రాసుకంటే బెంగాల్ రాష్ట్రం ఈస్టిండియా కంపెనీకి(east india company in india) ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోంది. అక్కడి రాజు సిరాజుద్దౌలాతో ఒప్పందం చేసుకొని ఈస్టిండియా కంపెనీ వాణిజ్యం చేసుకుంటోంది. అదే క్రమంలో కోల్‌కతాలో తమదైన భారీ కట్టడాలు నిర్మించారు. వాటిని సిరాజుద్దౌలా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఈస్టిండియా వ్యాపారం దెబ్బతింది. విషయం తెలిసిన రాబర్ట్ క్లైవ్ మద్రాసు నుంచి సిపాయిలతో కోల్‌కతాకు వచ్చి.. ఓపిగ్గా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. సిరాజుద్దౌలా అనుచరుడు మీర్‌జాఫర్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని.. యుద్ధం ప్రకటించాడు. అదే ప్లాసీ యుద్ధం. 1757 జూన్‌లో సిరాజుద్దౌలాను ఓడించి.. మీర్‌జాఫర్‌ను బెంగాల్ పీఠంపై కూర్చోబెట్టాడు క్లైవ్(robert clive achievements). అలా బెంగాల్‌లో వాణిజ్యంపైనే కాదు.. రైతులు, వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేసే అధికారాన్ని కూడా ఈస్టిండియా కంపెనీకి సంపాదించి పెట్టాడు. అప్పటిదాకా చాలా తక్కువగా ఉన్న భూమిశిస్తును మూడింతలు పెంచారు.
తనను బెంగాల్ నవాబును చేసిన క్లైవ్‌కు మీర్‌జాఫర్ కూడా భారీ ఎత్తున నజరానాలు సమర్పించుకున్నాడు. 2,34,000 పౌండ్ల నగదు; ఏటా 30వేల పౌండ్ల అద్దె వచ్చేలా.. భారీ జాగీర్‌ను అప్పగించాడు.
బెంగాల్ సంపద క్రమంగా బ్రిటిష్ వశం కావటం ఆరంభమైంది. క్లైవ్ వ్యక్తిగత ఖజానాతో పాటు ఈస్టిండియా కంపెనీ ఖాతాలు నిండసాగాయి. బెంగాల్ నవాబ్ ప్యాలెసులోని సొమ్మును.. సుమారు 100 పడవల్లో గంగానది దాటించి.. కంపెనీ కార్యాలయానికి చేర్చారంటే లూటీ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ నవాబుల ఖజానా నుంచి కంపెనీకి నేటి లెక్కల ప్రకారం 25 కోట్ల పౌండ్లు; తన ఖాతాలోకి 2.3 కోట్ల పౌండ్లు బదిలీ చేసుకున్నాడు క్లైవ్. యావత్ ఐరోపాలోనే సంపన్నుడిగా వెలిగాడు.