పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలతో పార్టీ రెండుగా చీలిపోతుందనుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ.. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం చూపింది అధిష్ఠానం. సుదీర్ఘంగా చర్చించి అందరిని మెప్పించింది. పంజాబ్‌లో లభించిన జోష్‌తోనే రాజస్థాన్ రాజకీయాలపై దృష్టిసారించింది. విబేధాలను రూపుమాపి, పార్టీని బలోపేతం చేసేందుకు నడుబిగించింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం కేబినెట్ విస్తరణ ఉండొచ్చని పలువురు నేతలు తెలిపారు.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ జైపుర్ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయన రాజస్థాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ కూడా ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, జిల్లా అధ్యక్షులు సహా ఇతర నియామకాలపై.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ వర్గాలతో మాట్లాడి విబేధాలు సద్దుమణిగేలా చేయాలని వేణుగోపాల్‌కు కాంగ్రెస్ హైకమాండ్ టాస్క్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు వేణుగోపాల్.
"నేను రాజస్థాన్ వెళ్తున్నా. ఆ రాష్ట్రం నుంచే నేను రాజ్యసభకు వెళ్లాను. మంత్రివర్గ విస్తరణపై నాకు ఏమీ తెలియదు. అధికారిక పనుల కోసమే వెళ్తున్నా."
- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
మంత్రిత్వ శాఖల కేటాయింపు.. కులాలు, మతాల మధ్య సమతూకంగా ఉండేలా చూసేందుకు అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా.. అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లతో వేణుగోపాల్ చర్చలు జరపనున్నారు. త్వరలోనే తుది ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందుకోసం శనివారం రాత్రికి సీఎంతోపాటు సచిన్ పైలట్ జైపుర్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి నివాసంలో నేతలు భేటీ కానున్నారు.
పైలట్ వర్గం అసహనం..
పంజాబ్ కాంగ్రెస్‌లో మార్పులు జరిగి అంతా సద్దుమణిగింది. అయితే.. రాజస్థాన్‌లో కేబినెట్ విస్తరణలో జాప్యంపై సచిన్ పైలట్ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పైలట్‌కు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని ఎమ్మల్యేలు కొద్ది రోజుల క్రితం బహిరంగంగానే డిమాండ్ చేశారు. త్వరలోనే ఆ దిశగా హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పైలట్ వర్గం తీరుతోనే మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తొమ్మిది మందికి అవకాశం..
రాజస్థాన్ కేబినెట్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 21 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా తొమ్మిది మంది కొత్తవారిని చేర్చుకునే వీలుంది. అయితే.. అందులో 6-7 సీట్లు తన వర్గంలోని ఎమ్మెల్యేలకే ఇవ్వాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు. అయితే.. సచిన్ డిమాండ్‌ను పూర్తి చేయలేమని, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికిన బీఎస్పీ ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి అశోక్ గెహ్లోత్ తెలిపినట్లు సమాచారం. కేబినెట్లోకి స్వతంత్ర ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యేలను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
సంధి సూత్రం..
మరోవైపు.. సైచిన్ వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు.. కేబినెట్‌తో పాటు కార్పొరేషన్, వివిధ బోర్డు పదవులను ఇచ్చేందుకు అధిష్ఠానం ప్రతిపాదన చేసినట్లు సమాచారం. దాంతో పాటు పైలట్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ పార్టీ ఓ సంధి సూత్రాన్ని సిద్ధం చేసిందని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ మార్పుపై ప్రకటనకు ముందు గెహ్లోత్‌ను మరోమారు దిల్లీ పిలిపించి మాట్లాడనున్నారని సమాచారం. అయితే.. ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదీ చూడండి:దిల్లీలో సచిన్ పైలట్.. వేడెక్కిన రాజకీయం
'కాంగ్రెస్‌తోనే సచిన్.. సమస్యలకు త్వరలోనే పరిష్కారం'