Major Ashish Martyr : తొలుత ఉద్యోగం చేసిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోనే అమరుడయ్యారు ఓ వీర జవాన్. ఆర్మీ అంటే ఇష్టంతో అందులో చేరి.. అంచెలంచెలుగా ఎదిగా మేజర్ స్థాయికి చేరుకున్న ఆయన.. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ముష్కరుల ఏరివేతకు వెళ్లి ఉగ్రమూకల కాల్పుల్లో వీరమరణంపొందారు. మొత్తం ముగ్గురు ఈ ఘటనలో అమరులు కాగా.. అందులో హరియాణాలోని పానీపత్కు చెందిన మేజర్ ఆశిష్ ధోనక్ ఉన్నారు. ఆయన వీర మరణం పట్ల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అదేసమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన కుటుంబ సభ్యుడి పట్ల గర్వంగా ఉందని అంటున్నారు.
ఆశిష్ ధోనక్ కథ..
పానీపత్ జిల్లాలోని బింఝౌల్ గ్రామంలో ఆశిష్ ధోనక్.. 1987 అక్టోబరు 22న లాల్‌చంద్, కమలాదేవి దంపతులకు జన్మించారు. ఆశిష్‌కు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆశిష్‌కు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని కోరికగా ఉండేది. అలాగే బాల్యం నుంచి క్రీడలు, చదువులోనూ ఆశిష్ బాగా రాణించేవారు. తల్లిదండ్రులు కూడా ఆశిష్‌ను ప్రోత్సహించేవారు. ఆశిష్ తండ్రి లాల్‌చంద్ ఉద్యోగం నిమిత్తం.. ఆయన కుటుంబం స్వగ్రామం నుంచి పానీపత్‌లోని ఎన్ఎఫ్ఎల్ టౌన్‌షిప్‌కు 1998లో మారింది. ఆ తర్వాత 2012లో ఆశిష్.. ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. మొదటగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో ఆశిష్‌కు పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేరఠ్, బారాముల్లా, బఠిండాలో విధులు నిర్వహించారు. 2018లో మేజర్‌గా ఆశిష్ పదోన్నతి పొందారు. మళ్లీ రాజౌరీకి మేజర్ హోదాలో బదిలీ అయ్యారు.
ఆశిష్ బాబాయ్ కుమారుడు వికాస్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఆయనలా తాను లెఫ్టినెంట్ కావాలని ఆశిష్ కలలు కని.. 2012లో అనుకుద్నది సాధించారు. ఆ తర్వాత 2015లో ఆశిష్‌కు జ్యోతి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు వామిక అనే రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. భార్య, కుమార్తె, కుటుంబ సభ్యులను వదిలి విధులను నిర్వర్తించేందుకు కశ్మీర్ వెళ్లారు ఆశిష్. ఈ క్రమంలో అనంతనాగ్‌లో ముష్కరులు, జవాన్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు.